బాయ్‌కాట్ చేసిన వారి పవర్ కట్.. నీతి అయోగ్ హిస్టారిక్ రికార్డ్
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన నీతి అయోగ్ సమావేశం అరుదైన చరిత్ర నమోదైంది.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన నీతి అయోగ్ సమావేశం అరుదైన చరిత్ర నమోదైంది. ఈ సమావేశానికి దేశంలోని ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఇలా వంద శాతం హాజరు నమోదైన సమావేశం గతంలో జరగలేదని అధికారులు చెబుతున్నారు. తొలిసారిగా విపక్షానికి చెందిన ముఖ్యమంత్రులు కూడా నీతి అయోగ్ సమావేశానికి హాజరై ఒక పరిపూర్ణత తీసుకువచ్చారని, అందుకే ఈ భేటీ చారిత్రాత్మకంగా నిలిచిందని అధికార ఎన్డీఏ కూటమి వ్యాఖ్యానిస్తోంది. ఇక ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడమే కాకుండా, ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా రికార్డు నమోదు చేసిన తరుణంలో జరిగిన ఈ సమావేశానికి అందరూ హాజరుకావడం విశేషంగా చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నీతి అయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులుతోపాటు ఇండియా కూటమికి చెందిన పార్టీల సీఎంలు, మరీ ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ పాలిస్తున్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తమ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సమావేశంలో చర్చించారు. అయితే నీతి అయోగ్ ప్రారంభించిన తర్వాత తొలిసారిగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరై ప్రత్యేక చర్చకు తెరలేపారని అంటున్నారు.
కేంద్రంలో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రణాళికా సంఘం స్థానంలో నీతి అయోగ్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నీతి అయోగ్ ద్వారానే రాష్ట్రాలకు నిధుల కేటాయింపు జరుగుతోంది. అయితే రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేస్తున్నారనే ఆరోపణతో గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించేవారు. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలు నీతి అయోగ్ సమావేశానికి ముఖం చాటేసేవారు. ఇలా 2024లో జరిగిన సమావేశానికి అప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన స్టాలిన్, మమత, సిద్ధరామయ్య బాయ్‌కాట్ చేశారు. ఇక 2025లో జరిగిన సమావేశానికి కేజ్రీవాల్, విజయన్ బహిష్కరించారు. అయితే వీరంతా ఇప్పుడు మాజీలు కావడం గమానార్హం. ముఖ్యంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని తీవ్రంగా విభేదించే మమత, కేజ్రీవాల్ పదవీచ్యుతులు కావడంతో ఈ సారి నీతి అయోగ్ సమావేశం చాలా ప్రత్యేకత సంతరించుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా ఎన్నికల్లో స్టాలిన్, మమత ఓడిపోవడం, కర్ణాటకలో అధికార మార్పుతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. దీంతో గురువారం జరిగిన నీతి అయోగ్ సమావేశానికి కొత్త ముఖ్యమంత్రులు అంతా హాజరయ్యారు. తమిళనాడు నుంచి దళపతి విజయ్, బెంగాల్ నుంచి సువేందు అధికారి వచ్చారు. ఇక విపక్షానికి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డికే శివకుమార్, వీడీ సతీషన్, సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరుకావడం కూడా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, విజయ్ పక్కపక్కనే కూర్చోన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మొత్తానికి 12 ఏళ్ల అనంతరం నీతి అయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రుల వంద శాతం హాజరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది జాతీయ రాజకీయాల్లో సరికొత్త చరిత్రగా నిలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.