మృత్యువు సైతం విడదీయలేని ప్రేమ.. సిగాచి పేలుడులో నవ దంపతులు మృతి!
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.;
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఉదయం పనికి వెళ్లిన కార్మికులు కాసేపటికే మంటల్లో కాలిపోయారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పెను పారిశ్రామిక ప్రమాదంగా నిలిచింది! ఈ ప్రమాదంలో... రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నవదంపతులు కూడా ఉన్నారు.
అవును... రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో.. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే.. ఆ నవదంపతులను మృత్యువు కూడా విడదీయలేదు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటనలో ఏపీకి చెందిన వీరిరువురూ మృత్యువాతపడ్డారు. కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, రమ్యశ్రీ దుర్మరణం పాలయ్యారు. దీంతో.. రెండు కుటుంబాల వారు శోకసంద్రంలో మునిగిపోయాయి. పోస్టుమార్టం చేసిన తర్వాత ఇద్దరి మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సమయంలో.. నిఖిల్ రెడ్డి మృతదేహాన్ని కడప జిల్లాకు తరలించగా.. రమ్యశ్రీ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు తరలించారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి భావోద్వేగం!:
ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భావోద్వేగానికి గురయ్యారు. ఆ నవదంపతులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో తనకు కన్నీళ్లు ఆగడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రారంభంలోనే ముగిసిన ప్రయాణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువ జంట ప్రేమ వివాహ సహాయం కోసం తనతో మాట్లాడారని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా వారితో తనకున్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగా... "కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు బిడ్డ నిఖిల్ రెడ్డి... ఎమ్మెస్సీ చదువుకొని పఠాన్ చెరువు సమీపంలో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు".
ఇదే సమయంలో... "ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో పుట్రెల గ్రామంలో సౌత్ మాలపల్లిలో ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టిన రామాల శ్రీ రమ్య.. తిరుపతి పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివింది. అనంతరం.. నిఖిల్ రెడ్డి పనిచేస్తున్న ఫార్మా కంపెనీలోనే ఉద్యోగం సంపాదించుకుంది!.
"వీరిద్దరూ సాధారణ కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని స్వయంకృషితో ఉద్యోగాలు సంపాదించుకున్నారు.. మంచి స్నేహితులుగా మారిన వాళ్లు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబాలకు తెలియజేశారు.. అయితే.. చిన్న చిన్న అవరోధాలు ఏర్పడ్డటంతో సహాయం కోసం నా దగ్గరకు వచ్చారు" అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ క్రమంలో తాను తొలుత నిఖిల్ రెడ్డి అమ్మగారితో మాట్లాడాను అని చెప్పిన కొలికపూడి శ్రీనివాస రావు... తనకు ఇద్దరు మగ పిల్లలని, నిఖిల్ పెద్ద కుమారుడని.. అతడు ఇష్టపడి రమ్యని కోడలుగా ఇంటికి తీసుకు వస్తే.. ఆ పాపని మా సొంత కూతురు లాగా చూసుకుంటాం అని అన్నారని తెలిపారు. వాళ్ల పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆ తల్లి చెప్పిందని అన్నారు.
ఆమె మాటలు విన్న తర్వాత.. రమ్య కుటుంబ సభ్యులకు తానే ధైర్యం చెప్పి, రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు మొదలుపెట్టానని.. అప్పుడు రెండు కుటుంబాలు కలుసుకున్నాయని.. రెండు కుటుంబాల పెద్దలు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుని, ఆషాడ మాసం తర్వాత మంచి ముహూర్తం చూసి పిల్లలకు పెళ్లి చేద్దామని నిర్ణయానికి వచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
అయితే.. సోమవారం తిరువూరు నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్న తనకు ఫార్మా కంపెనీలో పేలుడు గురించి, జరిగిన ప్రాణ నష్టం గురించి తెలిసిందని.. తెలిసీ తెలియగానే ఈ పిల్లలు పనిచేస్తున్న కంపెనీ పేరు తెలుసుకోవటానికి ముందుగా తానే నిఖిల్ కి ఫోన్ చేశానని.. ఆ తర్వాత రమ్య కి ఫోన్ చేశాను.. ఇద్దరి నుంచి స్పందనరాలేదని అన్నారు.
ఈ క్రమంలో... రమ్య అక్కకు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని.. తర్వాత టీవీ ఛానల్స్ లో ‘మృతుల్లో ఏపీకి చెందిన వారు’ ఉన్నట్లు చూశానని.. తర్వాత హైదరాబాద్ బయల్దేరి సాయంత్రం 6 గంటల వరకు ఫార్మా కంపెనీకి చేరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ సమయంలో.. రమ్య అక్క జ్యోత్స్న, ఆమె స్నేహితులు మరో ముగ్గురు తీవ్ర విషాదంలో అక్కడే ఉన్నారని భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే.
అనంతరం... ఉదయం నుంచి వర్షంలోనే తడుస్తూ కంపెనీ దగ్గరే ఉన్న రమ్య అక్కను.. ఆమె స్నేహితులను వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసి.. తాను రాత్రి 9 తర్వాత ఇంటికి చేరుకున్నట్లు తెలిపిన కొలికపూడి శ్రీనివాస్... ఉదయాన్నే బయలుదేరి మళ్లీ కంపెనీ దగ్గరికి వెళ్లాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే తెల్లవారే సమయానికి నిఖిల్ పాత రూమ్ మెట్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిపారు.
ఆ యువకుడు తనకు ఫోన్ చేసి.. 'వాళ్లిద్దరూ మనకు లేరు సార్' అని చెప్పాడు. మరి కాసేపటికి.. ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్టు.. ఆసుపత్రి నుండి రమ్య అక్కకు సమాచారం అందిందని వెల్లడించారు. ఈ విషాద సమయంలో ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు.