ఉత్త‌రాంధ్ర‌లో కొత్త జిల్లా... ఆ జిల్లాకు దెబ్బ‌డిపోతోందా..?

అయితే పలాస జిల్లా కేంద్రంగా చేస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చాలా అవరోధాలు ఉంటాయని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.;

Update: 2025-08-13 06:30 GMT

ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా అందరికీ తెలుసు. వైసిపి ప్రభుత్వం ఈ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది. ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 కు పెంచింది. ఉత్తరాంధ్ర‌లో విశాఖ , అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీలో మరో ఆరు కొత్త జిల్లాలు వస్తాయని అంటున్నారు. ఈ 6 జిల్లాలలో భాగంగా ఉత్తరాంధ్ర‌లో మరో కొత్త జిల్లా వస్తుందని అంటున్నారు. ఇప్పటిదాకా శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉంటూ వస్తున్న పలాస కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తారు అంటున్నారు. పలాస, ఇచ్చాపురం, టెక్కలి మూడు నియోజకవర్గాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దీంతో ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాలతో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు తగ్గిపోనుంది. పలాస కొత్త జిల్లాగా చేయడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే మూలపేట పోర్టు నిర్మాణంలో ఉంది. అలాగే కార్గో ఎయిర్‌పోర్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కోస్తా తీర ప్రాంతం కావ‌డంతో ఇక్క‌డ‌ అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తే వెనుకబడిన పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని కూటమి ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

అయితే పలాస జిల్లా కేంద్రంగా చేస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చాలా అవరోధాలు ఉంటాయని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎచ్చెర్ల ఈ జిల్లా అభివృద్ధికి ముఖద్వారంగా ఉండేది. అయితే ఇప్పుడు ఎచ్చెర్లను విజయనగరంలో విలీనం చేశారు. దీంతో శ్రీకాకుళం పారిశ్రామికంగా అభివృద్ధి చెంద‌డానికి అవ‌రోధాలు వ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఎచ్చెర్ల ప్రాంతంలోనే ఎక్కువుగా పారిశ్రామికీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇప్పుడు పలాసన సైతం జిల్లాగా చేస్తే శ్రీకాకుళం మరింతగా వెనక పడుతుందని శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆందోళనతో ఉన్నారు.

Tags:    

Similar News