సిక్ లీవ్‌లో నెదర్లాండ్స్ మోడల్… మన దేశంలో ఎందుకు లేదు?
భారత్‌లో జ్వరం వచ్చినా, ఒళ్లు సహకరించకపోయినా లీవ్ అడిగితే బాస్ ముఖం ఎలా పెడతారో మనందరికీ తెలిసిందే.;
భారత్‌లో జ్వరం వచ్చినా, ఒళ్లు సహకరించకపోయినా లీవ్ అడిగితే బాస్ ముఖం ఎలా పెడతారో మనందరికీ తెలిసిందే. కానీ నెదర్లాండ్స్ ప్రభుత్వం మాత్రం తన ఉద్యోగులకు ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తోంది. ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఏకంగా రెండేళ్ల పాటు 'పెయిడ్ సిక్ లీవ్' తీసుకోవచ్చు. ఈ నిబంధన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మన దేశంలో కూడా ఇలాంటి కనీస రక్షణ ఉంటే బాగుంటుందని ఐటీ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆశపడుతున్నారు.
రెండేళ్ల లీవ్.. 70 శాతం జీతం:
నెదర్లాండ్స్ చట్టం ప్రకారం, ఒక ఉద్యోగి అనారోగ్యం కారణంగా పని చేయలేకపోతే, సదరు కంపెనీ ఆ ఉద్యోగికి వరుసగా 104 వారాల (రెండు సంవత్సరాల) పాటు కనీసం 70 శాతం జీతాన్ని చెల్లించాలి. ఒకవేళ ఆ 70 శాతం జీతం అక్కడి కనీస వేతనం కంటే తక్కువైతే, మొదటి ఏడాది మాత్రం ప్రభుత్వం దాన్ని టాప్-అప్ చేసి ఆదుకుంటుంది. అంతేకాదు, ఉద్యోగి కోలుకున్న తర్వాత వారిని తిరిగి అదే పోస్ట్‌లో చేర్చుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీలదే. ఇది ఉద్యోగులకు ఆర్థికంగానే కాకుండా, మానసికంగా కూడా పెద్ద భరోసా ఇస్తుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రభుత్వం కూడా తోడుగా:
అక్కడి ప్రభుత్వం కేవలం లీవ్ ఇవ్వడమే కాదు, ఉద్యోగి మళ్లీ ఆరోగ్యవంతుడై విధుల్లో చేరేందుకు కంపెనీలు సహకరించాలని నిబంధన పెట్టింది. ఒకవేళ రెండేళ్ల తర్వాత కూడా ఆరోగ్యం కుదుటపడకపోతే, అప్పుడు 'డిసేబిలిటీ బెనిఫిట్స్' కింద ప్రభుత్వం సాయం చేస్తుంది. ఇక ఈ నిబంధన వల్ల అక్కడి ఉద్యోగులు ఆఫీస్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చికిత్స పొందుతారు. మన దేశంలో అయితే సిక్ లీవ్‌లు అయిపోగానే 'లాస్ ఆఫ్ పే' మొదలవుతుంది, అందుకే జ్వరంతోనైనా ఆఫీసులకు వెళ్లక తప్పని పరిస్థితి.
మన దేశంలో ఇలాంటి మార్పు సాధ్యమేనా?:
భారత్‌లో పెరుగుతున్న పని ఒత్తిడి, మానసిక సమస్యల నేపథ్యంలో నెదర్లాండ్స్ మోడల్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మన దగ్గర కేవలం పరిమితమైన సిక్ లీవ్‌లు మాత్రమే ఉంటాయి, అవి దాటితే జీతం కట్ అవుతుంది. ఇక నెదర్లాండ్స్ లాంటి నిబంధనలు వస్తే కంపెనీల మీద భారం పడుతుందని కొందరు వాదిస్తున్నా, ఉద్యోగి క్షేమంగా ఉంటేనే కదా కంపెనీ అభివృద్ధి చెందేది అనే వాదన బలంగా వినిపిస్తోంది. మన ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల వెల్ఫేర్ కోసం ఇలాంటి సరికొత్త పాలసీలపై దృష్టి సారించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.