హీటెక్కిన నెల్లూరు పాలిటిక్స్...నువ్వా నేనా అంటూ !

నెల్లూరు మేయర్ పదవి కోసం అధికార కూటమి తో పాటు విపక్ష వైసీపీల మధ్య అతి పెద్ద పొలిటికల్ వార్ సాగుతోంది.;

Update: 2025-12-13 03:51 GMT

నెల్లూరు మేయర్ పదవి కోసం అధికార కూటమి తో పాటు విపక్ష వైసీపీల మధ్య అతి పెద్ద పొలిటికల్ వార్ సాగుతోంది. గట్టిగా నాలుగు నెలలు కూడా లేని ఈ పదవి కోసం ఎందుకు పోరు అంటే అదే రాజకీయంగా ప్రతిష్ట అని అంటున్నారు. ఇక చూస్తే నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా 2019 నుంచి 2024 మధ్యలో మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఉండేవారు, రూరల్ కి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇక మేయర్ ఎన్నికల్లో అనాడు కోటం రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఫలితంగా ఆయన వర్గానికే పీఠం దక్కింది. ప్రస్తుతం మేయర్ గా ఉన్న స్రవంతి కోటం రెడ్డి అనుచరురాలు అని అంటారు అయితే ఆమె కూటమి అధికారంలోకి వచ్చాక అటూ ఇటూ మారారు. ఇక మేయర్ గా ఆమెని దించేసి తన మనిషిని గెలిపించుకోవాలని కోటం రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇక నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న వారు సాక్షాత్తూ మున్సిపల్ మినిస్టర్ కావడంతో నెల్లూరు మేయర్ మీద అవిశ్వాసం ప్రతిపాదించారు. దాంతో ఈ నెల 18న అవిశ్వాసం మీద ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్ చేపట్టనున్నారు.

ఇదీ బలం :

ఇదిలా ఉంటే 2021లో నెల్లూరు కార్పోరేషన్ కి ఎన్నికలు జరిగినపుడు మొత్తం 53 కార్పోరేటర్లూ వైసీపీ సొంతం అయ్యారు. విపక్షానికి కార్పోరేషన్ లో ఒక్క సీటూ లేదు. కానీ 2024 ఎన్నికల తరువాత సీన్ మారింది. అందులో ఏకంగా 40 మంది వైసీపీ కార్పోరేటర్లు విడతల వారీగా కూటమిలో చేరిపోయారు. ఇక వైసీపీకి మిగిలింది 13 మంది మాత్రమే అని అంటున్నారు. అధికారికంగా చూస్తే మేయర్ గా వైసీపీకి చెందిన స్రవంతి ఉన్నా అనధికారికంగా టీడీపీదే పెత్తనం సాగుతోంది. ఇపుడు మేయర్ నే టీడీపీకి చెందిన వారిని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.

అయిదురుగు వెనక్కి :

ఇక వైసీపీ చేతిలో ఉన్న మేయర్ పీఠం టీడీపీకి చెందకుండా ఆ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటోంది. రంగంలోకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిగిపోయారు. ఆయన చొరవతో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వారిలో అయిదురుగు కార్పోరేటర్లు తిరిగి వైసీపీ గూటికి చేరారు దాంతో వైసీపీ బలం కాస్తా 18కి పెరిగింది. మరి కొందరిని తమ వైపు తిప్పుకుంటే కార్పోరేషన్ లో మేయర్ మీద అవిశ్వాసాన్ని ధీటుగా తిప్పికొట్టవచ్చు అని వైసీపీ ఆలోచిస్తోంది. ఈ నేపధ్యంలో అనిల్ కుమార్ అయితే తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.

కోటం రెడ్డి పట్టుదలతో :

ఇంకో వైపు చూస్తే కనుక కోటం రెడ్డి శ్రీధర్ పట్టుదలగా ఈ విషయనని తీసుకున్నారు. ఎలాగైనా తన మనిషిని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ హవా చలాయించేందుకు ఇది ఉపకరిస్తుంది అని ఆయన నమ్ముతున్నారు. దాంతో తమ వైపు ఉన్న కార్పోరేటర్లతో క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు అని అంటున్నార్.అయితే అనిల్ కుమార్ యాదవ్ సైతం వైసీపీ పట్టు జారకూడదని చూస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య మేయర్ ఎన్నికల రాజకీయం హీటెక్కిస్తోంది. మొత్తానికి చూస్తే ఈ నెల 18న మేయర్ మీద అవిశ్వాసం మాత్రం రాజకీయంగా సంచలనంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News