నీట్ స్కామ్ : కొడుకు కోసం రూ.10 లక్షలకు పేపర్ కొనుగోలు.. రిజల్ట్స్ లో ఊహించని ట్విస్ట్

ఇలా ముందుగా పేపర్ సంపాదించిన దినేశ్ బివాల్ కు పరీక్ష అనంతరం దిమ్మతిరిగే షాక్ తగిలిందని అంటున్నారు.

Update: 2026-05-17 07:56 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల విచారణలో తాజాగా ఒక విస్తుపోయే సమాచారం బయటపడింది. లక్షల రూపాయలు గుమ్మరించి, పరీక్షకు ముందే లీక్ అయిన క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చినా ఒక విద్యార్థి కనీస మార్కులు కూడా సాధించలేకపోయాడని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఇక పేపర్ లీక్ తో తండ్రిని పోలీసులు అరెస్టు చేయగా, కుమారుడు పరారయ్యాడని చెబుతున్నారు.

రూ. 10 లక్షల డీల్

నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో కీలక నిందితుడిగా భావిస్తున్న దినేశ్ బివాల్ అనే వ్యక్తి తన కుమారుడు రిషి కోసం పరీక్షకు ముందే పేపర్ సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. పేపర్ లీక్ గ్యాంగ్‌ను సంప్రదించి ఏకంగా రూ.10 లక్షలు చెల్లించి పరీక్షకు ముందే నీట్ క్వశ్చన్ పేపర్‌ను కొనుగోలు చేశాడని సీబీఐ అధికారుల దర్యాప్తులో వెల్లడైందని చెబుతున్నారు.

సీన్ కట్ చేస్తే..

ఇలా ముందుగా పేపర్ సంపాదించిన దినేశ్ బివాల్ కు పరీక్ష అనంతరం దిమ్మతిరిగే షాక్ తగిలిందని అంటున్నారు. నీట్ పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ చేతికి దొరికినా, దినేశ్ కుమారుడు రిషి కనీస ప్రతిభ చూపలేకపోయాడు. మొత్తం 720 మార్కులకు గానూ అతడు కేవలం 107 మార్కులు మాత్రమే అటెంప్ట్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో అంత డబ్బు పెట్టి కొన్న పేపర్ వృథా కావడమే కాకుండా, ఇప్పుడు అరెస్టు కూడా కావాల్సివచ్చిందని చెబుతున్నారు.

ఇక విద్యార్థి రిషి గత విద్యా రికార్డులను పరిశీలించిన సీబీఐ అధికారులకు అసలు విషయం అర్థమైంది. అతను టెన్త్ క్లాస్‌లో కేవలం 44 శాతం, ఇంటర్‌లో 50 శాతం మార్కులతో పాసయ్యాడు. బేసిక్స్ కూడా లేకపోవడంతో, చేతికి క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కనీసం ఆన్సర్స్ గుర్తుపెట్టుకుని రాయలేకపోయాడని అధికారులు విశ్లేషిస్తున్నారు. కాగా, పేపర్ లీక్ కేసులో సీబీఐ అధికారులు తండ్రి దినేశ్ బివాల్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అయితే విద్యార్థి రిషి ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. అతని కోసం సీబీఐ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్రమ మార్గాల్లో సీట్లు సాధించాలనుకునే వారికి, ఈ ఘటన ఒక కనువిప్పు లాంటిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదువు అబ్బని కొడుకు కోసం తండ్రి ఆశపడి జైలుపాలవ్వగా.. కొడుకు పరారీలో ఉండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News