నీట్ లో సంచలన మార్పులు.. ఇకపై సీబీటీ విధానం..
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) లో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పులు చేసేందుకు అడుగులు వేస్తోంది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) లో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పులు చేసేందుకు అడుగులు వేస్తోంది. 2026 నీట్ పరీక్షా పత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలకు తావులేకుండా పరీక్షా విధానాన్నే పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల వయోపరిమితితో పాటు, పరీక్ష రాసే అవకాశాల సంఖ్యపై కూడా కఠినమైన ఆంక్షలు విధించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అంటున్నారు.
పార్లమెంట్ కమిటీ పరిశీలన
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హాజరయ్యారు. ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సీనియర్ కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, లీకేజీల మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు మూడు ప్రధాన దీర్ఘకాలిక వ్యూహాలను ఆయన దిగ్విజయ్ కమిటీకి వివరించారని చెబుతున్నారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
ప్రస్తుతం కొనసాగుతున్న ఓఎంఆర్ పరీక్ష విధానానికి స్వస్తి చెప్పి, పూర్తి స్థాయిలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బహుళ విడతలలో పరీక్ష నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వివరించినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు దేశమంతటా ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనివల్ల లీకేజీల ముప్పు ఎక్కువగా ఉందని అంటున్నారు. దీంతో ఇకపై జేఈఈ తరహాలోనే వివిధ తేదీల్లో, బహుళ విడతల్లో నీట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్ వివరించారని అంటున్నారు.
ఇక అర్హతల వయోపరిమితి, అటెంప్ట్స్‌పై కట్టడి చేయాలన్న ప్రతిపాదనను తీసుకువచ్చారని అంటున్నారు. ప్రస్తుతం నీట్ రాయడానికి కనీస వయసు 17 ఏళ్లు ఉండాలని మాత్రమే చెబుతున్నారు. కానీ, గరిష్ఠ వయోపరిమితి లేదు. అదేవిధంగా ఎవరైనా ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చునని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, దీనివల్ల కొందరు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో ఉంటూ పరీక్షల మాఫియాతో చేతులు కలుపుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వయసుపై పరిమితితో పాటు, ఒక అభ్యర్థి గరిష్ఠంగా ఎన్నిసార్లు పరీక్ష రాయాలనే దానిపై ఆంక్షలు విధించాలని సూచనలు వస్తున్నాయని చెబుతున్నారు.
మాట మార్చిన ఎన్టీఏ
ఇదిలా ఉంటే, పార్లమెంటరీ కమిటీ ముందు ఎన్‌టీఏ డీజీ అభిషేక్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నీట్ 2026 పేపర్ లీక్ కాదని, కేవలం ఒక గెస్ పేపర్ లోని ప్రశ్నలు మాత్రమే అకస్మాత్తుగా అసలు ప్రశ్నపత్రంలో కనిపించాయని ఆయన సమర్థించుకున్నారు. ఈ వాదనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదని, దేశంలోని 22 లక్షల మంది విద్యార్థులను మానసిక వేదనకు గురిచేసిన ‘నేషనల్ ట్రామా ఏజెన్సీ’ అంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పరీక్షల మాఫియాతో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయిందని, ఎన్‌టీఏ డీజీ వాదనకు ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్థిస్తారా? అంటూ ప్రశ్నించింది.
పుణెలో ఎగ్జామ్ ఎక్స్‌పర్ట్ అరెస్ట్
మరోవైపు నీట్ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫిజిక్స్ పేపర్ లీక్ చేసిన ఆరోపణలపై పుణెకు చెందిన మనీషా సంజయ్ హవల్దార్ అనే మహిళను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సేఠ్ హీరాలాల్ షరాఫ్ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఈమెను, ఎన్‌టీఏ నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రానికి సంబంధించి పరీక్షల నిపుణురాలిగా నియమించింది. ఆ హోదాను దుర్వినియోగం చేస్తూ, పరీక్షల మాఫియాతో చేతులు కలిపి ఆమె ప్రశ్నలను బయటకు చేరవేసినట్లు సీబీఐ గుర్తించింది. ఈ సంచలన కేసులో సీబీఐ ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.