‘నీట్’ లీకులకు చెక్ : పరీక్ష విధానంలో కీలక మార్పులు!
వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ ఎంట్రన్స్ విధానాన్ని సమూలంగా మార్చివేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ ఎంట్రన్స్ విధానాన్ని సమూలంగా మార్చివేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ లో నిర్వహిస్తున్న పరీక్షలను ఆన్‌లైన్ కు మార్చనున్నట్లు తాజాగా ప్రకటించింది. నీట్ (యూజీ)- 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీకుతో పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షలు ఆన్ లైన్ లో జరగనున్నాయని అంటున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నీట్ విషయంలో కేంద్రం ఇప్పటికే ఆలస్యం చేసిందని, భవిష్యత్తులో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా సరైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు.
వచ్చేఏడాది నుంచి నీట్ ఎంట్రన్స్ టెస్టును ఆన్‌లైన్ లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ మేరకు పరీక్షల విధానంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నీట్-2026 రద్దు నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మే 3న జరిగిన నీట్ ఎంట్రన్స్ టెస్టును జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను వచ్చేనెల 21న నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక లీకుల బెడదతో ఎన్టీఏ అప్రతిష్ట మూటగట్టుకుంటుండటంతో వచ్చేఏడాది నుంచి ఆన్ లైన్ విధానానికి మారాలనే సంచలన నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
నీట్ తోపాటు జాతీయస్థాయిలో పలు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షలు నిర్వహిస్తోంది. 2018లో కేంద్రం ఈ ఏజెన్సీని ప్రవేశపెట్టగా, నీట్ నిర్వహణలో మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతోంది. వైద్య విద్యకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండటం, పరిమిత సంఖ్యలోనే సీట్లు ఉండటం వల్ల నీట్ నిర్వహణ కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సగటును 20 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షను ఆఫ్‌లైన్ లో నిర్వహించడం కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరీక్ష కేంద్రాల కొరత దీనికి ప్రధాన కారణంగా చూపుతున్నారు. దీంతో గతంలో నీట్ పేపర్లు లీకైనప్పటికీ యథావిధిగా ఆఫ్‌లైన్ విధానానికే ఎన్టీఏ మొగ్గు చూపేది. అయితే ఈ సారి మళ్లీ లీక్ అవ్వడంతో ఎన్టీఏపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి సంస్కరణకు సిద్ధమైందని అంటున్నారు.
కేంద్రం తాజా ప్రకటనతో నీట్ పరీక్షల నిర్వహణ సమూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం 720 మార్కులకు దాదాపు మూడు గంటల పాటు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 180 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది. అయితే వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ విధానానికి మారితే ప్రశ్నపత్రంలో కూడా మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం జేఈఈ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కావడం లేదని చెబుతున్నారు. ఈ కారణంగానే నీట్ ఎంట్రన్స్ ను ఆన్ లైన్ కు మార్చాలని డిమాండ్ వచ్చింది. పేపరు లీకు బెడదతో తీవ్ర విమర్శలు చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకుందని చెబుతున్నారు. అయితే, పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది? ఎలా ఉంటుందనేది త్వరలో తెలియజేసే అవకాశం ఉందని అంటున్నారు.