మహిళా బిల్లు షాక్...హాట్ కేకుల్లా పదవులు !

మహిళా బిల్లు లోక్ సభలో వీగిపోవడంతో ఎన్డీయేకు భారీ షాక్ తగిలింది. తొలిసారి తగిలిన ఈ దెబ్బకు ఎన్డీయే నేతలు అబ్బా అంటున్నారు.;

Update: 2026-04-18 18:39 GMT

మహిళా బిల్లు లోక్ సభలో వీగిపోవడంతో ఎన్డీయేకు భారీ షాక్ తగిలింది. తొలిసారి తగిలిన ఈ దెబ్బకు ఎన్డీయే నేతలు అబ్బా అంటున్నారు. అదే సమయంలో తమ ఫస్ట్ స్ట్రోక్ ఎలా ఉందని విపక్షం ఎకసెక్కమాడుతోంది. ఈ విధంగా బిల్లు ఓడుతుందని ఎన్డీయే ప్రాభవం వాడుతుందని కాషాయం పెద్దలు అసలు ఊహించనే లేదు అని అంటున్నారు. అయితే ఎంతైనా కాషాయం పార్టీ పెద్దలు కదా అందుకే అంతే తొందరగా తేరుకున్నారని విపక్షం ముక్కుకు తాడు వేసేందుకు పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నారు అని అంటున్నారు.

సౌత్ స్ట్రోక్ అంటేనే :

ఇప్పటిదాకా బీజేపీ ఎన్ని సార్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఉత్తర భారతీయ పార్టీగానే ఉంటూ వచ్చింది దక్షిణాదిన ఆ పార్టీ బలపడాలని చూసినా ఆ ప్రయత్నాలు పాక్షికంగానే విజయం సాధిస్తున్నాయి. పైగా గతంలో లేని విధంగా ఉత్తరాది దక్షిణాది అన్న వివక్షను తెస్తున్నారు. అన్యాయం చేస్తున్నది బీజేపీ అని కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు నాయకులు కూడా గగ్గోలు పెడుతున్నారు. దాని ఫలితమే మహిళా బిల్లు ఓటమి అని బీజేపీ కూడా గ్రహించింది. అందుకే సౌత్ స్టేట్స్ పట్ల మునుపటి కంటే మరింత అలెర్ట్ గా ఉండాలని ఈ బిల్లు ఓటమి ఒక పాఠం నేర్పింది అని అంటున్నారు.

కొత్త వ్యూహంతో :

దీంతో బీజేపీ కూడా దక్షిణాది మీద తనదైన పట్టుని రాజకీయంగా బిగించేందుకు సరికొత్త దారులను వెతుకుతోంది అని అంటున్నారు. కేంద్రంలో కీలక పదవుల విషయంలో ఇప్పటిదాకా ఉత్తరాది పెత్తనమే కొనసాగుతోంది. డీఎంకే కాంగ్రెస్ కామ్రేడ్స్ అన్నారని కాదు కానీ ఇదే కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిని రూపుమాపుకోవడానికి బీజేపీ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తుంది అని అంటున్నారు. దాంతో చాలా మంది పంట పండనుంది అని కూడా ప్రచారం సాగుతోంది.

కీలక పదవులతో :

తొందరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది అని అంటున్నారు దాంతో ఈసారి దక్షిణాదికి ఎన్డీయే పెద్ద పీట వేస్తుందని అంటున్నారు దాంతో ఏపీ తెలంగాణా తమిళనాడు ఎక్కువగా లబ్ది పొందుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో ఒకటి కేబినెట్. అయితే ఈసారి సాహ మంత్రి పదవిని కేబినెట్ స్థాయికి ప్రమోట్ చేస్తూ ఇంకో సహాయ మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇలా అదనంగా లభించే మంత్రి పదవిని బీసీ నేత ఈటెల రాజేందర్ కి ఇస్తారు అని గట్టిగా వినిపిస్తోంది. ఒక వేళ ఆయన కాకపోతే మరి కొందరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని అందులో రాజ్యసభ నుంచి లక్ష్మణ్ కూడా ఉన్నారని చెబుతున్నారు.

వీరికి గోల్డెన్ చాన్స్ :

అదే వరసలో ఏపీ నుంచి చూస్తే మరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని ప్రస్తుతం ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇండిపెండెంట్ చార్జి తో ప్రమోషన్ ఉండొచ్చు అని అంటున్నారు. అలా పెమ్మసాని చంద్రశేఖర్ కి స్వతంత్ర హోదా మంత్రిగా పదోన్నతి దక్కుతుందని అంటున్నారు. అలాగే బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర కేబినెట్ లో స్థానం కానీ లేదా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి కానీ లభిస్తుందని అంటున్నారు. ఆమెకి ఈ దఫా గోల్డెన్ చాన్స్ తగలడం ఖాయమని అంటున్నారు. ఇంకో మంత్రి పదవి జనసేనకి కూడా దక్కే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. అదే విధంగా తమిళనాడు నుంచి చూస్తే అన్నా మలైకి ఏపీ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రి వర్గంలో తీసుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా కేరళ నుంచి రాజ్యసభకు ఒకరిని పంపించి అక్కడ కూడా మరో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. కేవలం మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా కీలకమైన మంత్రిత్వ శాఖలు కూడా దక్షిణాదికి ఇస్తారని ప్రచారం అయితే సాగుతోంది. అదే నిజం అయితే మాత్రం మహిళా బిల్లు షాక్ ఎన్డీయేకు తగిలింది కానీ హాట్ కేకుల్లా పదవులు దక్షిణాదికి వచ్చి పడతాయని అంటున్నారు

Tags:    

Similar News