4 ఏళ్లలో 12 మంది శాస్త్రవేత్తలు మాయం... అమెరికాలో ఏం జరుగుతోంది?

అమెరికా అన్ని రంగాల్లో దూసుకు పోతుంది. ముఖ్యంగా ఇతర దేశాలతో పోల్చితే అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.;

Update: 2026-04-24 09:23 GMT

అమెరికా అన్ని రంగాల్లో దూసుకు పోతుంది. ముఖ్యంగా ఇతర దేశాలతో పోల్చితే అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా ఇప్పటికే పలు అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. భవిష్యత్తులో అంతరిక్షం పై పట్టు కోసం నాసా పెద్ద ఎత్తున ప్రయోగాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే మరోసారి చంద్రుడిపై నివాసయోగ్య ప్రదేశాలకు సంబంధించిన ప్రయోగాలు నాసా మొదలు పెట్టింది. చంద్రమండలంపై ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా చాలా పెద్ద కసరత్తు నాసా చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు నాసా శాస్త్రవేత్తలు కనిపించకుండా పోవడం, హత్యకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల 29 ఏళ్ల ఏరోస్పేస్‌ టెక్నాలజీస్ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ జోషువా లెబ్లాంక్ మృతి చెందడం పలు అనుమానాలకు తెర లేపింది.

నాసా శాస్త్రవేత్తల హత్యలు...

జోషువా లెబ్లాంక్ మాత్రమే కాకుండా అమెరికా ఎఫ్‌బీఐ లెక్కల ప్రకారం 2022 నుంచి 2026 మధ్య కాలంలో నాసాకు చెందిన దాదాపు 12 మంది శాస్త్రవేత్తలు కనిపించకుండా పోయారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఏరోస్పేస్‌, అణు రంగాల్లో శాస్త్రవేత్తలుగా విధులు నిర్వహిస్తున్నారు. జోషువా లెబ్లాంక్‌ మరణం చాలా విచిత్రంగా ఉండటంతో ఆయన మరణం సహజంగా జరిగింది కాదే కాదని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. జులై 22, 2025న అలబామాలోని హంట్స్‌విల్లేలో టెస్లా కారులో జోషువా ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మరణించాడు. మధ్యాహ్నం సమయంలో రోడ్డు పక్కన ఉన్న కంచెను జోషువా కారు ఢీ కొట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని విచారణ కమిటీ సభ్యులు అంటున్నారు. సాధారణంగా టెస్లా కారు యాక్సిడెంట్‌ లకు అంత ఈజీగా గురి కాదు. కానీ జోషువా ప్రయాణిస్తున్న కారు మొదట కంచెను ఢీ కొట్టి, ఆ తర్వాత కొన్ని చెట్లను సైతం ఢీ కొట్టింది.

టెస్లా కారుకు యాక్సిడెంట్‌...

టెస్లా కారుకు జరిగిన ప్రమాదం చూసి చాలా మంది ఇది యాక్సిడెంట్‌ కాదని, కావాలని ఎవరో చేసినట్లుగా ఉందని అంటున్నారు. పైగా ఆ కారు హంట్స్‌విల్లే ఎయిర్‌ పోర్ట్‌లో నాలుగు గంటల పాటు పార్క్‌ చేసి ఉండటంపై చర్చ జరిగింది. జోషువ ఆ విమానాశ్రయం కు వెళ్లడం గురించి ఎవరికీ సమాచారం లేదు. ఆయన ఎందుకు అక్కడకు వెళ్లాడు అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో హత్యకు సంబంధించి మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం జోషువ మాత్రమే కాకుండా నాసాకు చెందిన శాస్త్రవేత్తలు పది మంది ఇలాగే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎక్కడ కూడా క్లూ విడువకుండా శాస్త్రవేత్తలను హత్య చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట యాక్సిడెంట్స్ అనుకున్న అమెరికన్‌ ప్రభుత్వం ఇప్పుడు ఎఫ్‌బీఐ తో విచారణకు సిద్ధం అయ్యింది.

అమెరికాలో పరిస్థితులు...

యూఎఫ్‌ఓ పరిశోధకుడు, టీవీ హోస్ట్‌ డేవిడ్‌ విల్కాక్‌ మృతి సైతం పలు అనుమానాలకు తెర లేపింది. కొలరాడోలో డేవిడ్‌ మృతి చెంది కనిపించారు. 53 ఏళ్ల విల్కాక్‌ డేవిడ్‌ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే అత్యున్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రముఖులు అనుమానాస్పద మృతి చెందడంతో అసలు అమెరికాలో ఏం జరుగుతుంది అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే యుద్ధం కారణంగా తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదురు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా శాస్త్రవేత్తల మరణం అనేది దేనికి సంకేతం అంటూ పలువురు అమెరికన్స్ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేస్తున్నారు. శత్రు దేశాలకు సంబంధించిన గూఢాచారులు అమెరికాలో చేరి శాస్త్రవేత్తలను హత్య చేస్తున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్యలపై ఎఫ్‌బీఐ ఎలాంటి విచారణ చేపట్టనుంది అనేది చూడాలి.

Tags:    

Similar News