మోడీ టూర్ ప్లాన్స్...అంతా బ్యాలెన్స్
ఇలా కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాను చుట్టేసిన నరేంద్ర మోడీ తొలిసారి రాయల సీమకు హ్యాట్రిక్ ప్రధాని హోదాలో వస్తున్నారు.;
ప్రధాని నరేంద్ర మోడీ చాలా విషయాల్లో పూర్తి అవగాహనతో ఉంటారు. ఆయన దేశానికి ప్రధాని ఆయన ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అలాగే అనేక కేంద్ర పాలిత ప్రాంతాలకు పెద్దగా ఉంటారు. అయితే సుదీర్ఘ కాలం కేంద్రంలో అధికారంలో ఉండే భాగ్యం ఆయనకు దక్కింది. దాంతో మోడీకి దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు తిరిగి అక్కడ జనాలతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం దక్కింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఆయన తన పదకొండేళ్ళ ప్రధానమంత్రిత్వంలో ఎన్నో సార్లు వచ్చి వెళ్ళారు. ఆయన ఎపుడు వచ్చినా ఏపీలో ఆయన టూర్ చేసే ప్రాంతానికి ఒక విశేషం అయితే ఉంటుంది. అది రాజకీయంగా ప్రాంతీయంగానే కాదు అనేక సమీకరణలతో ముడిపడి ఉంటుంది. అలా పక్కాగా డిజైన్ చేసుకోవడం అంటే దటీజ్ స్ట్రాటజీ అనాల్సిందే
మూడోసారి ప్రధానిగా :
నరేంద్ర మోడీ మూడోసారి కేంద్రంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటికి మూడు సార్లు ఏపీకి వచ్చారు. మొదటిసారి ఆయన నేరుగా విశాఖకే వచ్చారు. విశాఖలో ఈ జనవరిలో జరిగిన అతి పెద్ద బహిరంగ సభలో వేలాది కోట్ల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఆ తరువాత మోడీ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. ఇక విశాఖలో ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోడీ పాల్గొన్నారు.
సీమకు అలా :
ఇలా కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాను చుట్టేసిన నరేంద్ర మోడీ తొలిసారి రాయల సీమకు హ్యాట్రిక్ ప్రధాని హోదాలో వస్తున్నారు. ఆయన ఈసారి పర్యటనలో అభివృద్ధి ఆధ్యాత్మికత అన్నీ మేళవిస్తున్నారు. నంద్యాలలో మోడీ పర్యటన ఉంది. అక్కడే ఆయన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనంతరం సభలో ప్రసగిస్తారు.
ఇంట్రెస్టింగ్ ట్వీట్ :
ఇక మోడీ తన ఏపీ టూర్ మీద సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. తాను ఈ నెల 16న ఏపీలో ఉంటాను అని తన షెడ్యూల్ ని అఫీషియల్ గా రివీల్ చేసారు. ఏపీలో తాను గడిపేది ఎక్కడ ఏ ప్రోగ్రాం ని అటెండ్ అవుతున్నది ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ఏపీలోని కీలకమైన మూడు రీజియన్లను మోడీ కవర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో బీజేపీ కూడా పటిష్టం కావాలన్న ఆలోచనతోనే మోడీ ఉన్నారని అందుకే ఆయన పర్యటనలు కూడా దానికి తగినట్లుగా రూపొందుతున్నాయని చెబుతున్నారు.