వణుకుతున్న గొంతుతో ఇంటింటికీ ...తొంభై ఏళ్ళ వృద్ధుడి సాహసం

కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల సమరం సాగుతోంది. డిసెంబర్ 9, 11 తేదీలలో రెండు దఫాలుగా జరిగే ఈ ఎన్నికల ఫలితాలు 13న వెలువరిస్తారు.;

Update: 2025-11-29 20:30 GMT

ఆయన వయసు అచ్చంగా తొంబై ఏళ్ళు. జీవితంలో అన్ని దశలనూ దాటిన ఏజ్ అది. సాధారణంగా ఈ దేశంలో డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి అన్నీ వదిలేసుకుని కేవలం ఇంటి పట్టునే గడుపుతారు. తమకు నచ్చిన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. అప్పటికి మనసు శరీరం పూర్తిగా అలసిపోవడంతో ఇక రామా క్రిష్ణా అనుకుంటారు. కానీ ఆయన అలా కాదు వయసు ముదిరినా మనసు మాత్రం పదునే అని తేల్చారు. తనకు ఇంకా పట్టుదల ఉందని చాటారు. అందుకే ఆ వృద్ధుడు ఎవరూ చేయని సాహసమే చేశారు. అదే ఎన్నికల్లో పోటీ.

ఒక వార్డు మెంబర్ గా :

కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల సమరం సాగుతోంది. డిసెంబర్ 9, 11 తేదీలలో రెండు దఫాలుగా జరిగే ఈ ఎన్నికల ఫలితాలు 13న వెలువరిస్తారు. ఈ స్థానిక ఎన్నికల్లో తొంబై ఏళ్ళ వృద్ధుడు నారాయణ నాయర్ ఆశమన్నూరు అయ్తే ఒక గ్రామ పంచాయతీలో రెండవ వార్డుకు అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీని టికెట్ అడగలేదు, తానే ఇండిపెండెంట్ గా పోటీలో నిలబడ్డాడు. అంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఆయనకు తీరని కోరిక జీవితంలో ఉందిట. అదే తన వార్డు అభివృద్ధి. దానిని ఇంతకాలం ఎవరూ అభివృద్ధి చేయలేదని ఆయనే స్వయంగా ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాడు. తాను కనుక గెలిస్తే రెండవ వార్డుని ప్రగతి పధంలో దూసుకుని పోయేలా చేస్తాను అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

ఒంటరిగా ప్రచారం :

ఇక ఈ వృద్ధుడు ఇండిపెండెంట్ కావడంతో ఎవరూ వెంట లేరు. దాంతో తానే ఒంటరిగా ప్రతీ ఇంటి తలుపు తట్టి తనను గెలిపించమని కోరుతున్నాడు. ఆయన స్వరం అయితే వణుకుతోంది. అది వయోభారం వల్ల. అదే సమయంలో మనసు మాత్రం గట్టిగా ఉంది. పట్టుదల అంతకంటే ఉంది. అందుకే ఆయన తనను గెలిపించాలి సుమా అని అభ్యర్థి స్తున్నాడు. ఇక చూస్తే ఆయన ధైర్యం గురించే వార్డు గ్రామం మండలం, జిల్లా రాష్ట్రం దాటి బయట కూడా అంతా చర్చించుకుంటున్నారు.

వయసు అడ్డు కాదు :

ఇదిలా ఉంటే తాను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానో చెప్పిన నారాయణ్ నాయర్ తన వయసు తన అభీష్టానికి అడ్డు కాదని తేల్చేశారు. తాను తన వార్డుని అభివృద్ధి చేసుకోవడం కోసమే పోటీ చేస్తున్నాను తప్ప మరోటి కాదని అన్నారు. ఇక తాను నెగ్గితేనే తప్ప తమ ప్రాంతం బాగుపడదని ఆయన భావిస్తున్నారు మరో వైపు చూస్తే నారాయణ్ నాయర్ ఎన్నికల గుర్తుగా కెటిల్ ఇచ్చారు. దాంతోనే ఆయన ప్రతీ ఇంటికీ వెళ్ళి ఆ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.

భీకర పోరు :

ఇక కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు ఒక భీకరంగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు చేస్తున్నాయి. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతీ అభ్యర్ధి తన అనుచరులు అభిమానులతో జనం మధ్యకు వస్తూంటే నారాయణ్ నాయర్ మాత్రం ఏ మాత్రం ఆత్మ విశ్వాసం సడలిపోనీయకుండా పోటీకి సై అంటున్నాడు. తనకే జనాలు పట్టం కడతారు అని కడు నమ్మకంగా ఆయన ఉన్నారు. మరి ఆయన విజయం సాధిస్తారో లేదో అన్నది డిసెంబర్ 13న తేలనుంది. అయితే నారాయణ్ నాయర్ పోటీ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఏది చేయాలనుకున్నా వయసు అడ్డు కాదని. నీకు నచ్చిన పని ఈ జీవితం ముగించేలోగా చేసెయ్. ముందు ప్రయత్నం అయినా చెయ్. ఫలితం ఆ తరువాత చూసుకో. నిజంగా నాయర్ ఇచ్చిన స్పూర్తి అందరికీ అవసరమే అంటున్నారు.

Tags:    

Similar News