మళ్లీ నోరు జారిన 'నారాయణ'.. ఎందుకిలా?
ఏపీ సీఎం చంద్రబాబు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణం సహా.. మెట్రో రైలు ప్రాజెక్టులను మంత్రి నారాయణ చేతిలో పెట్టారు.;
ఏపీ సీఎం చంద్రబాబు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణం సహా.. మెట్రో రైలు ప్రాజెక్టులను మంత్రి నారాయణ చేతిలో పెట్టారు. ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, దుందుడుకు స్వభావి కాని వ్యక్తి అన్న కారణంగానే ఆయ నకు ఈ కీలక ప్రాజెక్టులు అప్పగించారు. నిజానికి ఆయన అలాంటి నాయకుడే. ఎక్కడా ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఆయ న వ్యవహరించలేదు. కానీ.. ఎందుకో..ఇటీవల ఆయన సహనం కోల్పోతున్నారు. ఇటీవల.. రాజధాని నిర్మాణాలకు సంబంధించి ఇంజనీర్‌పై 'స్టుపిడ్, గెటౌడ్, వేస్ట్ ఫెలో. హోపలెస్' అంటూ విరుచుకుపడ్డారు. ఇవి సర్కారుకు ఇబ్బందిగా మారాయి.
ప్రతిపక్ష పత్రికలు వీటిని హైలెట్ చేశాయి. అయినా.. మంత్రిలో మార్పు రాలేదు. తాజాగా అమరావతి రాజధానికి సంబంధించి కూడా అలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి పరిధిలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిని ఒప్పించి.. రప్పించేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివా రం నుంచి ఆయన సింగపూర్‌లో పర్యటించి.. ఆయా కంపెనీలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. ఇంతలోనే మంత్రి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''అమరావతిని చూసి ఎవరూ రావడం లేదు'' అని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా సింగపూర్ కంపెనీలకు అమరావతిలో 1450 ఎకరాల భూములను కేటాయించామని చెప్పిన నారాయణ.. ఇంత చేసినా ఆయా సంస్థలకు కృతజ్ఞత లేదన్నారు. వాటిని బ్రతిమాలుకునే పరిస్థితి వచ్చిందని.. తాము వెంటబడి వాటిని తీసుకు రావాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారని అనేశారు. వాస్తవానికి ఇవన్నీ.. తెరచాటు సమస్యలు. వైసీపీ హయాంలో జరిగిన రాజధాని యాగీతో సహజంగానే పెట్టుబడి దారులు భీతిల్లారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే.. తమకు ఇబ్బందులు తప్పవని వారు భావిస్తున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో తెరచాటు మాటలు, విషయాలను ఇలా బహిర్గతం చేయడం ఏంటన్నది ప్రశ్న. అనేక విషయాలు నాలుగు గోడల మధ్య జరుగుతూనే ఉంటాయి. అయితే.. వీటిని ఇలా అసహనం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందు వ్యాఖ్యానిస్తే.. ఎలా? అన్నది ప్రశ్న. ఇకనైనా మంత్రి నారాయణ జాగ్రత్తగా వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. ఇంత కష్టం కూడా.. విమర్శల బూడిదలో పోసినట్టు అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.