లోకేష్ 2.0: 'చినబాబు' వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే..
తెలుగుదేశం పార్టీ భావినేత, ఏపీ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ లుక్ లో చాలా మార్పు కనిపిస్తోంది.;
తెలుగుదేశం పార్టీ భావినేత, ఏపీ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ లుక్ లో చాలా మార్పు కనిపిస్తోంది. యువగళం పాదయాత్రకు ముందు నుంచి బాడీ ఫిటె నెస్ పై దృష్టి పెట్టిన లోకేశ్ ఈ మధ్య మరీ సన్నగా మారిపోయారు. దీంతో ఆయన డైట్ సీక్రెట్ ఏంటి? అన్న చర్చ ఎక్కువగా సాగుతోంది. రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు మానసిక పరిపక్వతతోపాటు శారీరక దృఢత్వం చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని లోకేష్ అక్షరాలా పాటిస్తున్నారని అంటున్నారు.
గత కొంతకాలంగా లోకేష్ లుక్‌లో భారీ మార్పు కనిపిస్తోంది. మునుపటి కంటే ఆయన చాలా స్లిమ్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన దాదాపు 13 కేజీల బరువు తగ్గినట్లు చెబుతున్నారు. లోకేశ్ వెయిట్ లాస్ సీక్రెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా లోకేశ్ డైట్ సీక్రెట్ పై యువతరం విస్తృతంగా చర్చించుకుంటున్నారు. జంక్ ఫుడ్ కారణంగా లోకేశ్ వయసు వారు ఇప్పుడు అధిక బరువుతో సతమతమవుతున్నారు. కానీ లోకేశ్ అధిక బరువు సమస్యను ఎప్పుడో అధిగమించారు. ఇంకా తన ఆరోగ్యం మెరుగుపడలనే ఆలోచనతో కొత్త డైట్ ఫాలో అవుతున్నారు. దీంతో కొద్ది కాలంలోనే ఆయన భారీగా బరువు తగ్గారని చెబుతున్నారు.
ఏమిటా డైట్
లోకేష్ తన బరువును అదుపులో ఉంచుకోవడానికి 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' అనే పద్ధతిని అనుసరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విధానంలో కేవలం ఒక పూట మాత్రమే ఆయన ఆహారం తీసుకుంటున్నారని చెబుతున్నారు. తన బిజీ షెడ్యూల్‌ను బట్టి ఆయన 16:8 లేదా 18:6 ఫాస్టింగ్ పద్ధతులను పాటిస్తున్నారు. అంటే రోజులో 16 నుంచి 18 గంటల పాటు ఏమీ తినకుండా, మిగిలిన 6 నుంచి 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా, ఆయన 'వన్ మీల్ ఏ డే' అనే విధానాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. రోజుకు కేవలం ఒక్క పూట మాత్రమే పోషకాహారం తీసుకుంటూ, తన బాడీ మాస్ ఇండెక్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అయితే, ఇలా ఒక్క పూట తినేటప్పుడు ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బ్రాహ్మణి ప్రోత్సాహం.. క్రమశిక్షణే ఆయుధం
లోకేష్ తన ఫిట్‌నెస్ క్రెడిట్‌ను గతంలోనే భార్య నారా బ్రాహ్మణికి ఇచ్చారు. తాను భోజన ప్రియుడినని, ఏది పడితే అది తినే అలవాటు ఉండేదని, కానీ బ్రాహ్మణి తన జీవనశైలిని మార్చడంలో కీలక పాత్ర పోషించారని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, క్రమం తప్పకుండా రన్నింగ్ చేయడం, ఆహార నియమాలు పాటించడం వంటివి ఆమె పర్యవేక్షణలోనే అలవాటయ్యాయని ఆయన పేర్కొన్నారు.
లాక్‌డౌన్ నుంచి మొదలైన ప్రయాణం
లోకేష్ ఫిట్‌నెస్ ప్రయాణం ఈ రోజుది కాదు. 2020 లాక్‌డౌన్ సమయంలోనే ఆయన కఠినమైన వర్కౌట్లు చేసి సుమారు 20 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత 'యువగళం' పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడవడానికి ఆయన అలవాటు చేసుకున్న ఈ క్రమశిక్షణే ఎంతో తోడ్పడింది. కేవలం బరువు తగ్గడమే కాకుండా, ఫ్యాటీ లివర్ సమస్యలు రాకుండా ఉండటానికి, గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడానికి ఈ డైట్ ప్లాన్ ఆయనకు సహాయపడుతోంది.
నిపుణులు ఏమంటున్నారు?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మెటబాలిజం మెరుగుపడుతుందని, బరువు తగ్గడానికి ఇది అద్భుతమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఒక్క పూట భోజనం చేసేటప్పుడు శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందేలా చూసుకోవాలని, లేదంటే నీరసం వచ్చే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. లోకేష్ మాత్రం నిపుణుల సలహాతో, పక్కా ప్లానింగ్‌తో తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.