కమ్యూనిస్టులకు లెఫ్ట్, రైట్ ఇచ్చిపడేసిన లోకేశ్.. విశాఖ వీడియో వైరల్

మంత్రి లోకేశ్‌తో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ శ్రీభరత్ ఇతర నాయకులు కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు.

Update: 2026-06-09 07:15 GMT

విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను మంత్రి లోకేశ్ పరామర్శించారు. విశాఖ కేజీహెచ్ లో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోనే మృతుల కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సమయంలో కొందరు కమ్యూనిస్టు పార్టీ నేతలు, కార్మిక సంఘాల నాయకులు మంత్రి లోకేశ్ తో వాగ్వాదానికి దిగారు. మృతులు, క్షతగాత్రులను ఆదుకోడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, అనుకోని దుర్ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. బాధితుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా, కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొందరు నాయకులు పెద్దగా కేకలు వేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి లోకేశ్‌తో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ శ్రీభరత్ ఇతర నాయకులు కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ చేరిన వామపక్ష పార్టీల నాయకులు, కొన్ని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రమాదానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లోకేశ్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ కార్మిక నాయకులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు వెనక్కి తగ్గకుండా మరింతగా రాద్దాంతం చేసేందుకు ప్రయత్నించారని అంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు.

రాజకీయాలు చేస్తున్నారా అంటూ ఫైర్

సాధారణంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నాయకుల సహనానికి పరీక్షగా నిలుస్తుంటాయి. అయితే మంత్రి లోకేశ్ ను రెచ్చగొట్టేలా కార్మిక నాయకులు మాట్లాడుతున్నా ఆయన ఎక్కడా చికాకు పడలేదు. ఎంతో ఓర్పుతో సమాధానం చెబుతూ కార్మిక సంఘాల వారిని వారించే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటోందని అంటున్నారు. "ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము. చనిపోయిన వారికి నాలుగు డబ్బులు ఇచ్చేసి, చేతులు దులుపుకోవడానికి రాలేదు. కుటుంబ యజమానులను కోల్పోయి తీరని వేదనలో ఉన్న ఆయా కుటుంబాలకు అండగా నిలిచేందుకు, వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకే మేము ఇక్కడికి వచ్చాం. ప్రమాదాలు జరగాలని ఎవరూ కోరుకోరు. అసంకల్పితంగా జరిగిన ఈ విపత్తును మనమంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలి" అని లోకేశ్ స్పష్టం చేశారు.

మంత్రి అంతటి వివరణ ఇస్తున్నా.. వామపక్ష నేతలు మాత్రం బాధితుల బాధ కంటే, ఆ ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ధోరణిలోనే నినాదాలు కొనసాగించారు. దీంతో నారా లోకేశ్ తన స్వరాన్ని మార్చారు. గట్టి స్వరంతో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "చనిపోయింది మీ కుటుంబ సభ్యులు కాదు కదా..! వాళ్లు ఎంత బాధలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఇక్కడ రాజకీయం చేయకండి. బాధిత కుటుంబాలకు జీవితాంతం తోడుగా ఉండే బాధ్యత మాది" అంటూ లోకేశ్ స్పష్టం చేయడంతో లెఫ్ట్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. లోకేశ్ చూపిన ఈ పట్టుదల, వాగ్ధాటితో అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లోకేశ్ సమయస్ఫూర్తిని, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను అభినందిస్తున్నారు.

నారా లోకేశ్ హామీ

అనంతరం మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులుగా తాము బాధితులకు తోడుగా ఉంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీని వేశామని, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఉమ్మడి పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని, ఇప్పుడు కూడా కార్మికులను రోడ్డున పడనీయబోమని లోకేశ్ భరోసా ఇచ్చారు. మొత్తానికి, విశాఖ పర్యటనలో నారా లోకేశ్ వ్యవహరించిన తీరు ఆయనలోని పొలిటికల్ మెచ్యూరిటీకి అద్దం పట్టిందని, శవరాజకీయాలు చేయాలని చూసిన వారికి తనదైన శైలిలో చెక్ పెట్టారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News