గూగుల్ సీఈవోతో లోకేశ్.. స్పెషలేంటో?

అమెరికాలో మంత్రి నారా లోకేశ్ నాలుగో రోజు పర్యటిస్తున్నారు. ఈ నెల 6న అమెరికా వెళ్లిన లోకేశ్ తొలి రోజు డల్లాస్ లో ప్రవాసాంధ్రలతో భారీ సమావేశం నిర్వహించారు.;

Update: 2025-12-10 04:11 GMT

అమెరికాలో మంత్రి నారా లోకేశ్ నాలుగో రోజు పర్యటిస్తున్నారు. ఈ నెల 6న అమెరికా వెళ్లిన లోకేశ్ తొలి రోజు డల్లాస్ లో ప్రవాసాంధ్రలతో భారీ సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన వేట మొదలుపెట్టారు. ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ మౌలిక సదుపాయాలకు మద్దతు కూడగట్టేలా వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే విశాఖలో రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో మరోసారి మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తోపాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలేను మంత్రి లోకేశ్ కలుసుకున్నారు.




విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనుల ప్రారంభించడంపై చర్చించారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని మంత్రి లోకేశ్ గూగుల్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.




మంత్రి లోకేశ్ విజ్ఞాపలపై స్పందించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ... భారత్ లో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతోపాటు “గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్” ద్వారా స్టార్టప్‌లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల విలువైన AI డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద ఎఫ్ డీఐగా మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు “వింగ్స్” తయారవుతున్నాయని తెలిపారు. గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారని చెప్పారు.




ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. మంత్రి లోకేశ్ తో సుందర్ పిచాయ్ తోపాటు గూగుల్ కు చెందిన గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే, గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియన్ ఉన్నారు. అదేవిధంగా మంత్రి లోకేశ్ ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో సమావేశమై అమరావతిలో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ తోనూ భేటీ అయ్యారు. ఏపీలో యూఎస్ పెట్టుబడులకు సహకరించాలని అభ్యర్థించారు.




Tags:    

Similar News