వైజాగ్ స్టేడియంలోని ఆ స్టాండ్ కు ‘మిథాలీ రాజ్’ పేరు.. మంత్రి లోకేశ్ ప్రకటన..

భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ దక్కించుకుంది. చివరి మ్యాచ్ లో సఫారీలతో ఆడిన మనవారు ఉతికి ఆరేశారు.;

Update: 2025-11-04 11:11 GMT

భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ దక్కించుకుంది. చివరి మ్యాచ్ లో సఫారీలతో ఆడిన మనవారు ఉతికి ఆరేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సఫారీలు 56 పరుగులు ఉండగానే మ్యాచ్ ను ఇండియాకు అప్పగించారు. దీంతో కప్పు ఇండియాకు దక్కింది. క్రీడా రంగంలో మహిళల సాధికారతకు కేవలం మాటలే కాకుండా చర్యలతోనే గౌరవం చూపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం అన్నారు. స్మృతి మందాన ఇటీవల చేసిన సూచనలను ఆయన హృదయపూర్వకంగా స్వీకరించి, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకెళ్లి, ఏపీ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు.

మందాన ఆలోచన లోకేశ్ ఆచరణ..

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మందాన ఇటీవల మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణులకు గౌరవం దక్కాలంటే వారి పేర్లను స్టేడియాలు, స్టాండ్లు, గ్యాలరీలకు పెట్టాలని సూచించారు. ఆమె ఆ ఆలోచనను లోకేశ్‌ ‘స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు. ‘ఆమె ఐడియాలు మాకు ఎంతో నచ్చాయి. అందుకే స్టేడియాల్లోని స్టాండ్లకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టే నిర్ణయం తీసుకున్నాం’ అని లోకేశ్ తెలిపారు. ఈ నిర్ణయం కేవలం ప్రతీకాత్మకంగానే కాకుండా.. మహిళా క్రీడాకారిణులకు దక్కాల్సిన గుర్తింపు సమాజానికి గుర్తు చేస్తోందని అన్నారు.

మిథాలీ రాజ్‌ స్టాండ్..

మహిళా క్రీడలకు ప్రత్యేక గుర్తింపుగా, విశాఖపట్నం స్టేడియంలోని ఒక స్టాండ్‌కి భారత లెజెండరీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ పేరు పెట్టారు. ‘మిథాలీ రాజ్‌ లాంటి గొప్ప క్రీడాకారిని మాత్రమే కాదు.. మహిళా సాధికారతకు కూడా చిహ్నం. ఆమె పేరు యువతుల్లో స్ఫూర్తి నింపుతుంది’ అని లోకేశ్ పేర్కొన్నారు. ఇది క్రీడాస్ఫూర్తిని స్త్రీ శక్తితో కలిపిన ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఇది క్రీడల్లో కొత్త అధ్యాయం అని లోకేశ్ తెలిపారు. మహిళా క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ‘మహిళా ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, పౌష్టికాహార పథకాలు, సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై పని చేస్తున్నాం’ అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ క్రీడల్లో సమాన అవకాశాలను కల్పించి, మహిళా ప్రతిభను వెలుగులోకి తెచ్చే దిశగా సాగుతున్నాయని చెప్పారు.

ఇతర క్రికెట్ అసోసియేషన్లకు పిలుపు..

‘మేము మొదలుపెట్టిన ఈ స్ఫూర్తిదాయక అడుగు ఒక చలనాన్ని సృష్టించాలి’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర క్రికెట్ అసోసియేషన్లు కూడా తమ స్టేడియాల్లో మహిళా క్రీడాకారిణుల పేర్లు పెట్టాలని పిలుపునిచ్చారు. అలా చేస్తే మహిళా క్రీడాకారిణుల కృషి తరతరాలకు గుర్తుండిపోతుందని, వారి కథలు భవిష్యత్తు తరాల ఆటగాళ్లకు మార్గదర్శకం అవుతాయన్నారు.

క్రీడల్లో సాధికారత అంటే కేవలం గెలుపు కాదు.. అది గౌరవం పొందడం, గుర్తింపును నిలబెట్టుకోవడం. లోకేశ్‌ నిర్ణయం ఆ దిశగా ఒక ప్రగతిశీల ఆలోచన. స్మృతి మందాన ఆలోచన, లోకేశ్‌ చర్య ఈ రెండు కలిసినప్పుడు ఒక నూతన సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. మహిళా క్రీడాకారిణుల పేర్లు స్టేడియాల్లో కాకుండా, మనసుల్లో చెక్కుకుపోవాలి.

Tags:    

Similar News