ఢిల్లీ గుసగుస : లోకేష్ గురించి అదే చర్చ !

నారా లోకేష్. కూటమి మంత్రి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అన్నింటికీ మించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ వారసుడు.;

Update: 2025-12-04 04:30 GMT

నారా లోకేష్. కూటమి మంత్రి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అన్నింటికీ మించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ వారసుడు. చంద్రబాబు దేశంలోనే ఒక కీలక దిగ్గజ నేత. చాలా విషయాలలో ఆయనకు సమ ఉజ్జీలు అయితే లేరు. అలా అరుదైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న బాబుకు వారసుడు అన్నది ఎంతో బరువైన బాధ్యత. 2017లో మంత్రి పదవి చేపట్టి ఎమ్మెల్సీగా నెగ్గిన లోకేష్ విషయంలో అంతా పెద్దగా సీరియస్ గా ఆలోచించలేదు. ఇక తొలి ఎన్నికల్లోనే మంగళగిరిలో ఓటమితో లోకేష్ మీద ఆశలు కూడా తగ్గాయని చెబుతారు.

పడి లేచిన తరంగం :

అయితే పోయిన చోటను వెతుక్కోవాలని భావించిన లోకేష్ పడి లేచిన తరంగం అయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో సవాల్ గా తీసుకుని ఎదిగారు. భారీ పాదయాత్రతో జనంతో కనెక్ట్ అయ్యారు. ఇక పార్టీ మీద కూడా పట్టు సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ గెలుపు వెనక లోకేష్ కీలక పాత్ర కూడా ఉంది అన్నది అంతా అంగీకరించే విషయం. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏణ్ణర్థం కాలంలో లోకేష్ పాలనలోనూ తన ముద్ర వేసుకుంటున్నారు. చంద్రబాబు అడుగు జాడలలో నడుస్తూ ఒక విధంగా బాగానే రాటు దేలారు.

ఢిల్లీతో బంధం :

లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఆసక్తిని పెంచుతున్నాయి చంద్రబాబుకు పని తగ్గిస్తూ తాను నెగ్గుతూ వస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో అయితే అన్ని విషయాలను కాలికి బలపం కట్టుకుని బాబు తిరిగేవారు ఢిల్లీలో కూడా ఆయన పర్యటించేవారు. బాబు స్వయంగా అప్పట్లో చెప్పుకున్నట్లుగా 29 సార్లు తిరిగారు. అంటే సగటున రెండు నెలలకు ఒకసారి వంతున అయిదేళ్ళ పదవీ కాలంలో బాబు ఢిల్లీకి వెళ్ళి ఏపీ కోసం నిధులను కోరుతూ వచ్చేవారు. ఇపుడు ఆ బాధ్యతలను పంచుకుంటూ లోకేష్ అన్నీ చక్కబెడుతున్నారు. తాజాగా మోంథా తుఫాన్ విషయంలో కేంద్ర సాయం కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలసి నివేదిక ఇచ్చారు. పనిలో పనిగా చాలా మంది కేంద్ర మంత్రులను కలసి ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కోరుతున్నారు. ఇలా నెలకు నెలన్నరకు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం దృష్టిలో ఏపీని ఉంది అభివృద్ధి కోసం నిధులు కోరడం అన్న బృహత్ కార్యక్రమం లోకేష్ పెట్టుకుంటూ వస్తున్నారు. దాంతో ఢిల్లీ బంధం గట్టి పడుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం లోకేష్ కి ఎంతో విలువ గౌరవం ఇస్తున్నారు. ఆయన విన్నపాలను మన్నిస్తున్నారు. ఆ విధంగా ఏపీకి మేలు జరుగుతోంది కూడా.

ఫ్యూచర్ లీడర్ గా :

ఇక తరచూ ఢిల్లీకి వస్తున్న లోకేష్ ని కేంద్ర పెద్దలు కానీ బీజేపీ ముఖ్యులు కానీ కీలక నేతగానే చూస్తున్నారు. ఒక విధంగా ఏపీ ఫ్యూచర్ లీడర్ గా భావిస్తున్నారు అని ఢిల్లీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తునాయి. లోకేష్ కేవలం ఏణ్ణర్థం వ్యవధిలోనే మంచి నేతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా యువ నాయకుడిగా కేంద్ర పెద్దల వద్ద మంచి మార్కులే సంపాదించారు అని అంటున్నారు. ఇక జాతీయ మీడియా సైతం లోకేష్ ని ఒక సాధారణ మంత్రిగా చూడటం లేదని అంటున్నారు. దాంతో లోకేష్ ఢిల్లీలో వెళ్తే ఒకనాడు చంద్రబాబుకు లభించిన గౌరవ మర్యాదలు అన్నీ ఆయనకు కూడా దక్కుతున్నాయని అంటున్నారు. దాంతో పాటే ఏపీ రాజకీయాల మీద లోకేష్ భవిష్యత్తు మీద కూడా చర్చ సాగుతోంది అని అంటున్నారు.

ఇపుడే కాదు :

అయితే ఎవరు ఎలా అనుకున్నా ఏ రకమైన చర్చలు సాగినా లోకేష్ అయితే ఏ మాత్రం తొందర పడటం లేదు అని అంటున్నారు. ఇక చంద్రబాబు రాజకీయ దురంధరుడు. ఆయనకు ఎన్నో చాణక్య వ్యూహాలు ఉంటాయి. ఎపుడు ఏమి చేయాలో బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దాంతో సరైన సమయంలోనే అన్నీ జరుగుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో పనులు చక్కబెట్టుకోవడం నెగ్గుకు రావడం అంత ఈజీ అయితే కాదు, కానీ లోకేష్ మాత్రం బాబు మాదిరిగా ఢిల్లీలోనూ పట్టు సాధిస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News