‘‘మా ఇంట్లో విభేదాలు’’ - మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుపుతున్నామని చిన్నచిన్న విభేదాలు ఉండటం సహజమని వ్యాఖ్యానించిన మంత్రి లోకేశ్ తమ కుటుంబంలోనూ చిన్నచిన్న విభేదాలు ఉంటాయని వెల్లడించారు.;
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుపుతున్నామని చిన్నచిన్న విభేదాలు ఉండటం సహజమని వ్యాఖ్యానించిన మంత్రి లోకేశ్ తమ కుటుంబంలోనూ చిన్నచిన్న విభేదాలు ఉంటాయని వెల్లడించారు. మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ నేతల శిక్షణ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమిలో తలెత్తుతున్న మనస్పర్థలపై పార్లమెంటరీ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు జోక్యం చేసుకోవాలని, చిన్నచిన్న సమస్యలను సరిదిద్దేలా ప్రయత్నించాలన్నారు.
కూటమిలో విడాకులు ఉండవని, క్రాస్ ఫైర్ లు అసలే ఉండవని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఏ జిల్లాలో సమస్య వచ్చినా సంబంధిత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడి సెటిల్ చేయాలని సూచించారు. ‘మీ స్థాయిలో సెటిల్ కాకుంటే జోనల్ ఇంచార్జి దృష్టికి తీసుకురండి. అక్కడా పరిష్కారం కాకుంటే రాష్ట్ర అధ్యక్షుడు, ఆపై తాను సమస్యను పరిష్కరిస్తాం’ అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమిలో విభేదాలు సహజమని ఆయన పేర్కొన్నారు. తమ ఇంట్లో కూడా చిన్నచిన్న విభేదాలు వస్తుంటాయని వెల్లడించారు.
‘‘మా ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నాం. మా మధ్య విభేదాలు వస్తుంటాయి. అన్నింటిపైనా ఒకసారి మాట్లాడతాం. పెద్దరికంగా చంద్రబాబు గారు బాధ్యత తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్నాక మరెవరం మాట్లాడం’’ అంటూ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. కూటమిలో చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకోండి. అంతా అప్రమత్తంగా ఉండండి. మనమధ్య విభేదాలు తీసుకురాడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తారు. మీరంతా జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
కూటమి పదిహేనేళ్లు కొనసాగుతుందని, ఈ విషయాన్ని తాను, మా అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నామని వ్యాఖ్యానించారు. ‘నేను మీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, ఈ మధ్య ఒక ట్రెండ్ కనిపిస్తోంది. వ్యవస్థలో పనిచేయడం మానేసి వ్యక్తులపై ఆధారపడుతున్నాం. మనమంతా ఒక వ్యవస్థలా పనిచేయాలని కోరుతున్నా’’ అంటూ నాయకులకు లోకేశ్ హితబోధ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టమంటూ వ్యాఖ్యానించారు లోకేశ్. ఈ మధ్య అంతా తాను బాగా చిక్కిపోయానని అంటున్నారని, నేను ఇలా చిక్కిపోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బే కారణమని లోకేశ్ సరదాగా చెప్పారు.