బాలికల విద్యపై పూర్తి నిషేధం... ఏమిటీ దుర్మార్గం..!
ఈ సందర్భంగా స్పందించిన యునెస్కో ఆఫ్ఘనిస్తాన్ అధికారి సూహ్యూన్ కిమ్... బాలికలకు విద్యను నిరాకరించినప్పుడు, మొత్తం దేశం దాని మూల్యం చెల్లిస్తుందని అన్నారు.;
ఆగస్టు 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాలిబన్లు.. ఆరో తరగతి కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు పాఠశాలకు వెళ్లడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే! ఇదే సమయంలో.. విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలను కూడా మహిళలకు మూసివేసింది! వారిని మాధ్యమిక, ఉన్నత విద్య నుండి మినహాయించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తోన్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... బాలికల విద్యను పూర్తిగా నిషేధించింది! దీంతో ఈ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది.
అవును... బాలికల విద్య విషయంలో ఆఫ్ఘాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలు పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్ల విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీంతో.. ప్రపంచంలోనే మహిళా విద్యను నిషేధించిన ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది! ఈ నేపథ్యంలో.. తాలిబాన్ ఆంక్షల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ లో సుమారు 2.2 మిలియన్ల కౌమార బాలికలు మాధ్యమిక విద్యకు దూరంగా ఉన్నారని యూనిసెఫ్, యునెస్కో ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.
ఈ సందర్భంగా స్పందించిన యునెస్కో ఆఫ్ఘనిస్తాన్ అధికారి సూహ్యూన్ కిమ్... బాలికలకు విద్యను నిరాకరించినప్పుడు, మొత్తం దేశం దాని మూల్యం చెల్లిస్తుందని అన్నారు. ఇదే సమయంలో.. ఆఫ్ఘనిస్తాన్ లో యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ తాజుదీన్ ఓయెవాలే స్పందిస్తూ.. విద్యా నిషేధం యొక్క దీర్ఘకాలిక పరిణామాలను నొక్కి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ కు మహిళా ఉపాధ్యాయులు, నర్సులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, వైద్యులు అత్యవసరంగా అవసరం అని అన్నారు.
ఇదే క్రమంలో... మహిళలకు మహిళలే చికిత్స చేయగల సందర్భంలో.. నేడు బాలికలకు విద్యను నిరాకరిస్తే, భవిష్యత్తులో అనారోగ్యంతో ఉన్న బాలికలను, మహిళలను ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. పిల్లలందరికీ సురక్షితమైన, సమానమైన విద్యను అందించేలా చూసేందుకు అత్యవసర సమిష్టి చర్య అవసరమని అన్నారు. ఈ విషయంలో ఆఫ్ఘాన్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డాక్టర్ ఓయెవాలే తెలిపారు.
వాస్తవానికి దాదాపు నాలుగేళ్లుగా మహిళలకు విద్యా హక్కు విషయంలో... ఐక్యరాజ్యసమితి, సహాయ సంస్థలు, హక్కుల సంఘాలు, కొన్ని ఇస్లామిక్ దేశాలు సైతం ఆఫ్ఘాన్ కు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తున్న తాలిబన్లు.. ఇది పూర్తిగా తమ అంతర్గత విషయం అని నొక్కి చెబుతున్నారు!
కాగా... 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నేదా మొహమ్మద్ నదీమ్.. ఉన్నత విద్యా మంత్రిగా నియమితులయ్యారు. తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదాకు సన్నిహితుడు అయిన నదీమ్.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ అంతటా ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల నుండి మహిళా విద్యార్థులు, మహిళా లెక్చరర్లను మినహాయించాలని ఆదేశించారు. ఈ విధానంలో ఎలాంటి మార్పు లేకుండా దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత కూడా నిషేధం అమలులో ఉండగా.. తాజాగా బాలికల విద్యను పూర్తిగా నిషేధించారు!