విజయసాయిరెడ్డి సైతం పాదయాత్ర... జగన్ కంటే ముందే ?
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి నేను సైతం అంటూ పాదయాత్రకు సిద్ధపడుతున్నారని ప్రచారం సాగుతోంది.;
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి నేను సైతం అంటూ పాదయాత్రకు సిద్ధపడుతున్నారని ప్రచారం సాగుతోంది. విజయసాయిరెడ్డి తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోలేదు అని. అంతే కాదు జస్ట్ గ్యాప్ మాత్రమే ఇచ్చాను అని. గత ఏడాది జనవరి 25న తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నాను అని ఈ ఏడాదితో తాను పెట్టుకున్న గడువు పూర్తి అయింది అని చెప్పకనే చెప్పారు. అందువల్ల తాను రాజకీయంగా ఇంకా చురుకుగా ఉంటాను అని సంకేతాలు ఇచ్చేశారు. అంతే కాదు తాను చేరబోయేది ఏ పార్టీలో అన్నది కూడా తొందరలో చెబుతాను అని ఆయన అంటున్నారు.
జనంలోకి వెళ్లి మరీ :
ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో చాలా కాలం పాటు ఉన్నారు. ఆయనకు ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉంది. దాంతో ఆయన ప్రజలలో ఏముందో జనం భావన ఏమిటి అన్నది తెలుసుకోవడానికి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు అని అంటున్నారు. అంతే కాదు ప్రతీ జిల్లాలో ఆయనకు వైసీపీ నుంచి తెలిసిన వారు ఉన్నారు. దాంతో ఆయన జనంలోకి వెళ్తే ఆదరణ ఎలా ఉంటుందో అలాగే తనతో నడచి వచ్చే వారు ఎవరో స్వయంగా తెలుసుకుంటారు అని అంటున్నారు. ఆ మీదట అన్నీ ఆలోచించి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయవచ్చు అన్నది విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.
కొత్త రాజకీయమేనా :
విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. అయితే బీజేపీ ఏపీ కూటమిలో ఉంది. దాంతో బీజేపీలో చేరేందుకు ఆయనకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం అయితే చాలా కాలంగా సాగుతోంది. దాంతో బీజేపీతో చేరడం కంటే సొంతంగా తాజకీయం చూసుకోవాలన్న రెండవ ఆలోచన కూడా విజయసాయిరెడ్డి చేస్తున్నారు అని అంటున్నారు. అంటే సొంతంగా పార్టీ పెట్టి దానిని ఏపీలో విస్తరించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అందుకే ఆ ప్రకటన :
ఈ మధ్యనే విజయసాయిరెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చినపుడు కొత్త పార్టీ అవసరం అయితే తానే స్థాపిస్తాను అని కూడా సంచలన ప్రకటన చేశారు. ఇపుడు అందులో భాగంగనే ఆయన జనంలోకి వెళ్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి పాదయాత్ర ఈ ఏడాది జూన్ లో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకం అయి ఏపీ ప్రజల ఆలోచనలు రాష్ట్రంలో కొత్త పార్టీకి ఉండే అవకాశాలు రాజకీయ శూన్యత ఏ మేరకు ఉంది అన్నది కూడా అంచనా వేసుకుంటారు అని చెబుతున్నారు. అంతే కాదు జనసేన మాదిరిగా తన పార్టీని బీజేపీకి సన్నిహితంగా మార్చే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారని చెబుతున్నారు.
ప్లాన్ వేరే లెవెల్ :
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను 2027 మధ్యలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఇపుడు జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే జగన్ కంటే ఏడాది ముందే విజయసాయిరెడ్డి జనంలోకి వెళ్తారు అని అంటున్నారు. అలా విజయసాయిరెడ్డి పాదయాత్ర సాగబోతోంది అని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి పాదయాత్ర గురించి వస్తున్న వార్తలు కానీ జరుగుతున్న ప్రచారం కానీ వాస్తవ రూపం దాల్చితే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టే అవకాశాలు అయితే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.