రైల్వే నుంచి ఆమెకు లక్షల్లో పరిహారం ఓ సంచలనం.. ఏమి జరిగిందంటే..!

అవును... రైళ్ల ఆలస్యం కారణంగా ఇబ్బంది పడిన ఓ విద్యార్థిని విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.;

Update: 2026-01-27 09:53 GMT

భారతదేశంలో రైలు సమయానికి స్టేషన్ కి రావడం, గమ్యస్థానాలకు చేరడంపై రకరకాల చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఆలస్యాల వల్ల ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు! ఈ నేపథ్యంలో.. రైలు ఆలస్యం వల్ల కలిగే పరిణామాలను ఎత్తిచూపే అరుదైన సందర్భంలో, ఉత్తరప్రదేశ్‌ లోని ఒక విద్యార్థిని తన రైలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా వచ్చినందుకు కీలకమైన ప్రవేశ పరీక్షకు హాజరు కాకపోవడంతో రైల్వేల భారీ పరిహారాన్ని గెలుచుకుంది.

అవును... రైళ్ల ఆలస్యం కారణంగా ఇబ్బంది పడిన ఓ విద్యార్థిని విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... రైలు సమయానికి రాకపోవడంతో ఉత్తరప్రదేశ్‌ లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి తన కెరీర్‌ కు కీలకమైన ప్రవేశ పరీక్షను మిస్సయ్యింది. దీంతో... ఈ విషయంపై ఆమె పోరాటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సుమారు ఏడేళ్ల తర్వాత ఆమెకు న్యాయం దక్కింది. ఈ విషయం వైరల్ గా మారుతుంది!

వివరాళ్లోకి వెళ్తే... సమృద్ధి అనే అమ్మాయి 2018లో తన బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్షకు సుమారు ఏడాది కాలంగా సిద్ధమవుతోంది! ఈ క్రమంలో ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌ సిటీ సూపర్‌ ఫాస్ట్‌ రైలు బుక్‌ చేసుకుంది. బస్తీ జిల్లా నుంచి ఆ రైలు ఉదయం 11 గంటలకు లక్నో చేరాల్సి ఉంది. అయితే... ఆ రైలు ఏకంగా రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది. కానీ.. పరీక్షా కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటల వరకే విద్యార్థులకు అనుమతి ఉంది.

దీంతో.. సమృద్ధి ఆ పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆమె న్యాయ పోరాటానికి దిగింది. ఇందులో భాగంగా... తన న్యాయవాది ద్వారా రూ.20 లక్షల పరిహారాన్ని కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ, జనరల్ మేనేజర్, స్టేషన్ సూపరింటెండెంట్‌ లకు నోటీసులు జారీ చేయబడ్డాయి.. కానీ సంతృప్తికరమైన స్పందన రాలేదు.

ఇరువైపులా వాదనలు విన్న జిల్లా వినియోగదారుల కమిషన్.. రైల్వేలు సకాలంలో సేవలను అందించడంలో విఫలమైందని తీర్పు చెప్పింది. ఈ సమయంలో.. రైల్వేలు ఆలస్యానికి కారణమని అంగీకరించినప్పటికీ, దానికి స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోయాయి. అయితే దాదాపు ఏడేళ్ల పాటు సాగిన ఈ విచారణలో సదరు విద్యార్థినికి 45 రోజుల్లోగా రూ.9.10లక్షల పరిహారం చెల్లించాలని.. లేని పక్షంలో 12% అదనంగా వడ్డీ చెల్లించాలని కమిషన్‌ రైల్వేను ఆదేశించింది!

ఈ సందర్భంగా స్పందించిన సమృద్ధి న్యాయవాది ప్రభాకర్ మిశ్రా.. మే 7, 2018న ఆమె లక్నోకు ప్రవేశ పరీక్ష రాయడానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని అన్నారు. రైలు ఆలస్యం కారణంగా ఆమె సకాలంలో కేంద్రానికి చేరుకోలేకపోయిందని.. దీంతో, ఆమె మొత్తం విద్యాసంవత్సరం వృధా అయిందని తెలిపారు. ఈ కేసు ఏడు సంవత్సరాలకు పైగా కొనసాగిందని.. ఫైనల్ గా విజయం దక్కిందని అన్నారు!

Tags:    

Similar News