19 సంవత్సరాలు... 6,940 రోజులు...లోకేష్ లవ్లీ రిప్లై
ఏపీలో రైజింగ్ పొలిటికల్ స్టార్ యువ మంత్రి నారా లోకేష్ తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక మైలు రాయిని చేరుకున్నారు.
ఏపీలో రైజింగ్ పొలిటికల్ స్టార్ యువ మంత్రి నారా లోకేష్ తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక మైలు రాయిని చేరుకున్నారు. ఆయన వైవాహిక జీవితంలో సరిగ్గా ఈ రోజుకు అంటే ఆగస్టు 26 నాటికి 19 ఏళ్ళు పూర్తి అయ్యాయి. నారా లోకేష్ బ్రాహ్మణిల జంట 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటోంది. దాంతో బంధు మిత్రులు సన్నిహితులతో పాటు పార్టీ నేతల నుంచి నారా లోకేష్ దంపతులకు అభినందనల వెల్లువ కురుస్తోంది. నారా లోకేష్ బ్రాహ్మణి వివాహం 2007 ఆగస్టు 26న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆనాటి రాజకీయ సినీ ప్రముఖులు అంతా ఈ వివాహ వేడుకలు హాజరై ఈ జంటను దీవించారు. అలా అందంగా మొదలైన లోకేష్ బ్రాహ్మణిల ప్రయాణం రెండు దశాబ్దాల కాలానికి చేరువ అయింది. ఒక విధంగా ఇది కీలక ఘట్టమనే చెప్పాలి.
యూత్ ఫుల్ కపుల్ గానే :
నిజానికి ఈ జంటకు రెండు దశాబ్దాల వైవాహిక బంధం ఉందని ఎవరూ అనుకోరు. ఈ రోజే పెళ్ళి అయిన కొత్త దంపతులు గానే కనిపిస్తారు. దానికి కారణం ఈ రోజుకీ యంగ్ గా ఉండడమే. అటు లోకేష్ కానీ ఇటు బ్రాహ్మణి గానీ వెరీ యంగ్ అన్నట్లుగానే ఉంటారు. అంతే కాదు జోరుగా హుషారుగా హెల్దీగా వారు కనిపిస్తూ అందరినీ కను విందు చేస్తున్నారు. ఇక ఇరవై ఏళ్ళు అంటే కాలానికి సంబంధిచిన జస్ట్ నంబర్ గానే ఉంది. కానీ ఈ ఇద్దరి మధ్య ప్రేమ అయితె రెట్టింపు అవుతూనే ఉంది అని అంతా అంటున్నారు. ముచ్చటైన జంటగా అందరూ వీరిని చూసి అంటున్నారు అంటే అది గొప్ప కాంప్లిమెంట్ గానే చూడాలి.
బ్రాహ్మణి ఏమన్నారు అంటే :
ఇక తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా బ్రాహ్మణి తన భర్త నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ బ్లాగ్‌ను ఉపయోగించారు. అందులో ఆమె తన మదిలోని భావాలని అద్భుతమైన సందేశంగా మార్చి భర్తతో పంచుకున్నారు. హ్యాపీ యానివర్సరీ, మై లవ్. మనం కలిసి 20 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో మనం నిర్మించుకున్న ప్రతీ దానికీ మనం సృష్టించుకున్న జ్ఞాపకాలకు మనం పంచుకుంటూ కొనసాగిస్తున్న ఈ ప్రయాణానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను అని బ్లాగ్ లో ఆమె రాశారు. అంతే కాదు తమ జీవన ప్రయాణంలోని ఎత్తుపల్లాలలో లోకేష్ తనకు ఎలా నిరంతర అండగా నిలిచాడో కూడా బ్రాహ్మణి ప్రస్తావించడం విశేషం. ఎన్నో కష్టసుఖాలలో నువ్వే నాకు తోడుగా ఉన్నావు అని పేర్కొన్నారు. మనం ఇరవై వార్షికోత్సవంలోకి ఉత్సాహంగా అడుగుపెడుతున్నామని లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ బ్రాహ్మణి చక్కగా రాశారు.
లోకేష్ ప్రేమ పూర్వక స్పందన :
ఇక బ్రాహ్మణి రాసిన దానికి నారా లోకేష్ కూడా ప్రేమ పూర్వకంగా తన హృదయ స్పందనను తెలిపారు. లోకేష్ రాసింది అయితే మరింత ఆసక్తికరంగా సాగింది. 19 సంవత్సరాలు. 6,940 రోజులు అంటూ రోజులు గంటలతో సహా లెక్కించి మరీ తమ వైవాహిక ప్రయాణానికి కొత్త అర్థాన్ని చెప్పారు. ఈ ప్రయాణంలో ప్రతి కష్టసుఖాలలో ప్రతి విజయంలోనూ ఎదురుదెబ్బలలోనూ నువ్వు నా బలం నా సహనం షరతులు లేని ప్రేమతో నాకు అండగా నిలిచావు అని బ్రాహ్మణీ గురించి లోకేష్ తన మదిలో భావాలను చక్కగా ఆవిష్కరించారు. బ్రాహ్మణి అన్నింటిలోనూ నువ్వే నాకు తోడుగా ఉన్నావు. వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూ మనం మరెన్నో సంవత్సరాలు కలిసి ఉండాలని కూడా నారా లోకేష్ ప్రస్తావించి కొసమెరుపు మెరిపించారు.
రోల్ మోడల్ గా :
నారా లోకేష్ బ్రాహ్మణి వారి రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అంతే కాదు వీవీఐపీ ఫ్యామిలీగా ఉన్నారు. ఇక ఇద్దరూ జీవితంలో ఎంచుకున్న వృత్తి వ్యాపకాలలో తీరిక లేనంతగా ఉంటూ వస్తున్నారు. అయినా వారి ప్రేమ అభిమానం అన్యోన్యత అంతకంతకు పెరుగుతూ ఇలా రెండు దశాబ్దాలకు చేరువ కావడం అందరికీ స్ఫూర్తి వంతంగా ఉంది అని చెప్పాలి. ఈ రోజుల్లో సెలిబ్రిటీలు కానీ సాధారణ జీవితాలు కానీ వైవాహిక బంధాల గట్టిదనాన్ని పూర్తిగా చూడలేకపోతున్నారు. దాంతో పాటుగా వైవాహిక బంధం పవిత్రతను కూడా గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ జంట ఒక అందమైన పాఠంగా కళ్ళ ముందు కనిపిస్తోంది. వారి స్పూర్తిని తీసుకుని సమాజంలోని జంటలు అన్నీ ఇదే విధంగా ప్రేమ పూర్వకంగా ఉంటే సమాజం ఎంతగానో వికసిస్తుంది అన్నది నిజం.