వైరల్ ఫొటోస్ : స్పెషల్ లుక్ లో నారా కుటుంబం!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం హిందూ ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తుంటుంది.;
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం హిందూ ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తుంటుంది. ముఖ్యంగా పూజలు, పండగలను చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. హిందూ ఆలయాలను సందర్శించాలన్నా, పూజలు చేయాలన్నా కూడా చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ముందుంటారు. తిరుమల వెంకన్న, విజయవాడ కనకదుర్గ ఆలయాలను దర్శించుకున్న సమయాల్లో కూడా ముఖ్యమంత్రి దంపతులు సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ క్రమంలో గత ముఖ్యమంత్రులకు చంద్రబాబు పూర్తి భిన్నంగా చెబుతుంటారు.
ఇక సంప్రదాయ పూజల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కూడా అనుసరిస్తున్నారు. వీరంతా మంగళవారం సంప్రదాయ బద్దంగా శివుడిని పూజించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ మంగళవారం హైదరాబాద్ లో భారీ ఎత్తున హోమం చేశారు. కార్తీకమాసం పురస్కరించుకుని ప్రత్యేకంగా చేసిన ఈ పూజలో సీఎం చంద్రబాబు కుటుంబం మొత్తం సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్ పోస్టు చేశారు.
రాష్ట్రం బాగుండాలని, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ తమ కుటుంబం ఈ రోజు పూజ చేసినట్లు మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో వాట్సాప్ చానల్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ పోస్టు చేసిన ఫొటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన విధానం.. సీఎం కుటుంబానికి హిందూ సంప్రదాయాలపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ సమయంలో గతంలో కొందరు ముఖ్యమంత్రులు హిందూ సంప్రదాయాల విషయంలో పాటించిన పద్ధతులను టీడీపీ సోషల్ మీడియా ఎత్తిచూపుతోంది. ఇక మంగళవారం పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ రోజు, రేపు ఆయన సత్యసాయి జిల్లాలోనే పర్యటించనున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవాలకు హాజరవుతున్న ప్రధాని మోదీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమం కూడా ఆధ్యాత్మిక పర్యటన కావడం విశేషం.