మా కుటుంబానికి ముప్పు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన భువనేశ్వరి వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ద్రవిడ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు దేశం మంచికోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలోనే తమ కుటుంబం కూడా రాష్ట్రం, దేశం కోసం పనిచేస్తోందని భువనేశ్వరి తెలిపారు. ఈ క్రమంలో తమ కుటుంబం తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోందని, అయినా తాము ముప్పును లెక్క చేయకుండా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
‘తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉంది. ఇంకా బెదిరింపులు వస్తున్నాయి. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. వైసీపీ పాలన గురించి మాట్లాడను. అది మరచిపోలేని అంశం’ అంటూ భువనేశ్వరి వ్యాఖ్యానించారు. అయితే సీఎం కుటుంబాన్ని ఎవరు బెదిరిస్తున్నారనేది ఆమె వెల్లడించలేదు. కుప్పంలో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రబాబు అరెస్టు సందర్భంగా రాజమండ్రి వచ్చిన జనాలను చూసి తమకు ఎంతో ధైర్యం వచ్చిందని భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు పడిన కష్టాన్ని ప్రజలు మరచిపోకుండా రావడాన్ని తాము ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని ఈ సందర్భంగా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.కాగా, భువనేశ్వరి తన భర్త, ముఖ్యమంత్రి చంద్రబాబుకు బదులుగా కుప్పం బాధ్యతలు తీసుకున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం వచ్చారు. తొలిరోజు బిజీబిజీగా గడిపిన భువనేశ్వరి గురువారం శాంతిపురంలోని తమ నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆమె అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం డీకే పల్లి వద్ద కృష్ణా జలాలకు ఆమె జల హారతి ఇచ్చారు. అంతకు ముందు గంగమ్మ ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారె అందించడం తన పూర్వ జన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు. కుప్పంలో ఇలా శ్రీశైలం నుంచి వచ్చిన కృష్ణా జలాలను చూడడం తన జన్మలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు.