బాలయ్య మరో సంచలనం... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై షాకింగ్ రియాక్షన్
హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై ఎప్పుడో కానీ సాధారణంగా మాట్లాడని బాలయ్య ప్రతిపక్షం వైసీపీ టార్గెట్ గా ఆదివారం పలు విమర్శలు గుప్పించారు. ఇటీవల అసెంబ్లీ ఎపిసోడ్ తో బాలయ్య వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ రచ్చ కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా సైలెంటు అయిన బాలయ్య సడన్ గా వైసీపీ ఆందోళన చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తనదైన విశ్లేషణ చేశారు.
రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించామని హడావుడి చేస్తున్న వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఐదేళ్లలో రూ.212 కోట్లు ఖర్చు చేసిన వైసీపీ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ విధానం ప్రవేశపెట్టడాన్ని సమర్థించిన బాలయ్య.. ఈ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తుందని స్పష్టం చేశారు. పీపీపీ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటు యాజమాన్యం కళాశాలలను నిర్వహిస్తుందని బాలయ్య వివరించారు.
పీపీపీ విధానంలో కాలేజీల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించినా ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందని బాలయ్య వ్యాఖ్యానించారు. ప్రైవేటు వారికి ఓ బాధ్యత, భయం ఉంటుందని క్వాలిటీ ఉంటుందని ఆయన వివరించారు. పీపీపీలో ప్రభుత్వ కమిటీ పర్యవేక్షిస్తుందని బాలయ్య తెలిపారు. ప్రైవేటు వారికి ఇచ్చినా ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని, అప్పుడు వచ్చిన ఇబ్బందేముందని ఆయన ప్రశ్నించారు.
మళ్లీ అధికారంలోకి రావాలనే ఆరాటంతో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో చేసిందేమీ లేదని, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలనే ఉబలాటంతో వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు బాలయ్య. వైసీపీ నేతల ప్రకటనలు కేవలం రాజకీయమేనని, వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని అన్నారు. వైసీపీది కేవలం ప్రచార ఆర్భాటంగా తేల్చేసిన బాలయ్య.. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ఎమ్మెల్యేగానే కాకుండా బసవతారకం ప్రైవేటు ఆస్పత్రి చైర్మన్ హోదాలో బాలయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలపై బాలయ్య ఎప్పుడూ ఇలా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా మాట్లాడటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.