పల్నాడు.. హాట్‌ సీట్‌ అతడికేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మార్పులుచేర్పులు సంగతి తెలిసిందే.

Update: 2024-01-12 14:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మార్పులుచేర్పులు సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 9 లోక్‌ సభా స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు.

కాగా పల్నాడు జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న నరసరావుపేట లోక్‌ సభా నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్‌ దృష్టి సారించారని టాక్‌ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో జగన్‌ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట స్థానాన్ని వైసీపీ అధికార ప్రతినిధి, ఏపీ విద్యా, మౌలిక వసతులు కార్పొరేషన్‌ చైర్మన్‌ గా ఉన్న నాగార్జున యాదవ్‌ కు కేటాయిస్తారని టాక్‌ నడుస్తోంది.

నాగార్జున యాదవ్‌ వయసులో చాలా చిన్నవాడు. కొద్ది రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. మంచి వాగ్ధాటి ఉన్న నేతగా జగన్‌ దృష్టిలో పడ్డారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నాగార్జున యాదవ్‌ ను నరసరావుపేట లోక్‌ సభా స్థానం నుంచి బరిలోకి దింపొచ్చని ప్రచారం జరుగుతోంది.

Read more!

నాగార్జున యాదవ్‌ గుంటూరుకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఆయన తల్లిదండ్రుల తరఫు బంధువులు నరసరావుపేట లోక్‌ సభా నియోజకవర్గం పరిధిలో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో నరసరావుపేట స్థానాన్ని నాగార్జున యాదవ్‌ కు కేటాయించాలని జగన్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ప్రస్తుత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్టు చెబుతున్నారు. తాను పోటీ చేస్తే నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట లోక్‌ సభా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని జగన్‌ తీసుకున్నారని అంటున్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు లావునే మళ్లీ కొనసాగించాలని కోరినట్టు టాక్‌. ముగ్గురు మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు వద్దని.. కొత్త అభ్యర్థికి సీటు ఇవ్వాలని కోరినట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News