నాగబాబు గురించి ఆలోచించడం లేదా ?

నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. పెద్దల సభలో ఆయన హాయిగా ఆరేళ్ల పాటు ప్రతినిధిగా ఉంటారు.;

Update: 2025-04-18 11:30 GMT

నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. పెద్దల సభలో ఆయన హాయిగా ఆరేళ్ల పాటు ప్రతినిధిగా ఉంటారు. నాగబాబు జీవితంలో ఈ పదవి ఎంతో కీలకమైనది. ఆరున్నర పదుల వయసు దాటిన ఆయనకు రాజకీయ జీవితంలో అంది వచ్చిన అవకాశంగా ఈ పదవి ఉంది అని చెప్పాలి.

నాగబాబు రాజకీయం చూస్తే ప్రజారాజ్యంలో తెర వెనక ఉండి సేవలు అందించారు. జనసేనలో అయితే తెర ముందుకే వచ్చారు. పార్టీలో కీలకంగా ఉంటున్నారు. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్ సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన మంచి పెర్ఫార్మెన్స్ చేశారు అనే చెప్పాలి.

అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ కి వెళ్ళాలన్న ఆయన కోరిక మాత్రం తీరలేదు. ఏది ఏమైనా ఎమ్మెల్సీగా నాగబాబు ఆ పదవిలో కుదురుకున్నారు. అయితే నాగబాబు వట్టి ఎమ్మెల్సీ యేనా ఇంకా పదవులు ఏమైనా రావాల్సినవి ఉన్నాయా అంటే అందరికీ కనిపించేదీ వినిపించేదీ ఆయనకు మంత్రి పదవి బాకీ ఉంది కదా అని.

నిజానికి నాగబాబు ఎడం చేత్తో ఎమ్మెల్సీ అయి కుడి చేత్తో మంత్రి పదవిని కొట్టాలి. కానీ ఆయనకు ఆ ఆశలు ఇప్పట్లో తీరుతాయా లేదా అన్నదే చర్చగా ఉంది. తెలుగువారి విశిష్ట పండుగ అయిన ఉగాది వెళ్ళిపోయింది. నిజానికి ఉగాదికే నాగబాబుకు మంత్రియోగం పట్టాలి. కానీ అలా జరగలేదు

ఇక చూస్తే ఏప్రిల్ నెల కూడా గడిచిపోతోంది. మే నెలలో అమరావతి రాజధాని పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. సో ఆ నెల కూడా బిజీగా ఉంటుంది. ఆ మీదట దాటిఏ మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు.

ఇక మళ్ళీ మంచిరోజులు వచ్చేటప్పటికి లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడతాయి అని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం 2026 మార్చితో అన్ని స్థానిక సంస్థల పదవీ కాలం ముగుస్తుంది. దాంతో ఆ ఎన్నికలను కూటమి ప్రభుత్వం ఒక సవాల్ గా తీసుకోవాల్సి ఉంది.

దాంతో ఆ హడావుడిలో నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చినా అది వేరే అర్ధాలకు సంకేతాలకు దారి తీస్తుంది అని అంటున్నారు. అలాగని ఆయనతో పాటు మరికొందరిని తీసుకుని ఒక స్మాల్ సైజ్ రీషఫలింగ్ చేయాలని చూసినా అసంతృప్తులు మొదలవుతాయి. అవి లోకల్ బాడీ ఫైట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయి. అలా కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చిన వారిని పని మంత్రులను కంటిన్యూ చేస్తూ అపుడు మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయట.

ఏతా వాతా తేలేది ఏమిటి అంటే కనుక నాగబాబు కు ఇప్పట్లో మంత్రి యోగం లేదు అన్నది. ఇక ఈ విషయాల మీద జనసేన అధినాయకత్వం కూడా పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు. అందుకే నాగబాబుని పిఠాపురం ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయనను ముందు పెట్టి అక్కడ పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే నాగబాబుకు మంత్రి పదవికి చాలా దూరం ఉందని అంటున్నారు. సో ఆయన వరకూ అయితే ఎలా ఉందో కానీ ఇది రాజకీయంగా చర్చగా ఉంది. అయితే ఎవరికి ఏ సమయంలో ఏ పదవి ఇవ్వాలో అన్నీ బాగా తెలిసిన వారుగా చంద్రబాబు ఉన్నారు సో నాగబాబు హామీ నెరవేరుతుంది కచ్చితంగా అని అంటున్నారు. కాకపోతే కాస్తా ఆలస్యం అన్నదే వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News