పాకిస్థాన్ లో అజ్ఞాత వ్యక్తుల హల్ చల్.. మసూద్ అజాద్ బంధువు హతం

దాయాది దేశం పాకిస్థాన్ లో అజ్ఞాత వ్యక్తులు అలజడి సృష్టిస్తున్నారు. గుట్టుగా వస్తున్న అజ్ఞాతవాసులు మోస్ట్ వాంటెండ్ తీవ్రవాదులను క్షణాల్లో మట్టుబెట్టి మాయమైపోతున్నారు.;

Update: 2025-04-09 23:30 GMT

దాయాది దేశం పాకిస్థాన్ లో అజ్ఞాత వ్యక్తులు అలజడి సృష్టిస్తున్నారు. గుట్టుగా వస్తున్న అజ్ఞాతవాసులు మోస్ట్ వాంటెండ్ తీవ్రవాదులను క్షణాల్లో మట్టుబెట్టి మాయమైపోతున్నారు. ఈ హఠాత్ పరిణామాలతో పాక్ ప్రభుత్వం తల్లడిల్లిపోతోందని అంటున్నారు. మరోవైపు భారత్ పై అప్రకటిత యుద్ధం చేస్తున్న ఉగ్రవాదులు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడిపోతున్నారని చెబుతున్నారు. పాక్ ప్రభుత్వంతోపాటు దాని ఇంటెలిజెన్స్ నెట్ వర్కు ఐఎస్ఐకి కూడా తెలియకుండా జరుగుతున్న ఈ దాడులు ఉగ్రవాదుల్లో దడ పుట్టిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి స్వర్గధామమైన పాకిస్థాన్ లో ఇప్పుడు వారికి రక్షణ కరువైంది. భారత వ్యతిరేక టెర్రరిస్టులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి చేరడం లేదు. ‘‘అజ్ఞాత వ్యక్తులు’’ లేదా ‘‘గుర్తు తెలియని వ్యక్తుల’’ దాడుల్లో మరుసగా మరణిస్తున్నారు. సింపుల్ గా బైక్ పై వచ్చేవారు ఉగ్రవాదిని దగ్గర నుంచి కాల్చివేసి శరవేగంగా అక్కడి నుంచి పారిపోతున్నారు. అసలు వీరు ఎవరనేది మిస్టరీగా మారుతోంది.

కెనడాలో ఖలీస్థాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లే పాక్ లో భారత వ్యతిరేక శక్తులను ఏరివేస్తుండటం ఆసక్తి రేపుతోంది. గతంలో కెనడాలో తలదాచుకున్న ఖలీస్థానీ టెర్రరిస్ట్ హరదీప్ సింగ్ నిజ్జర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం తెలిసిందే. ఇప్పుడు పాక్ లోనూ అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, జైషే ఏ మొహమ్మద్ అధినేత మౌలానా అజార్ బంధువు మౌలానా ఐజాజ్ అబిద్ ను కాల్చిచంపారు. పాకిస్థాన్ రాడికల్ ఇస్లామిస్ట్ గా ఐజాజ్ అబిద్ కు పేరుంది. ఇతను జైషే కోసం కీలక రిక్రూటర్ గా కూడా వ్యవహరిస్తుంటాడని అంటారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ లోని పిష్టాఖరా ప్రాంతంలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు అబిద్ ని కాల్చి చంపడం పాక్ లో చర్చనీయాంశమైంది.

అహ్లే-ఎ-సున్నత్ వాల్ జమాత్ ((ASWJ) అనే ఉగ్రవాద సంస్థకు అబిద్ బాగా కావాల్సిన వాడిగా చెబుతున్నారు. అంతర్జాతీయ ఖత్మ్-ఎ-సబువత్ ఉద్యమానికి ప్రాంతీయ అధిపతిగా ఇతడు పనిచేస్తున్నాడు. ఒక మసీదు వెలుపల జరిగిన మెరుపుదాడిలో ఇతను హతమయ్యాడు. జైషే మహ్మద్ లో అబిద్ కీలక వ్యక్తిగా చలామణి అవుతున్నాడు. అలాంటి కీలక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడంతో టెర్రరిస్టు క్యాంపులు హడలిపోతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News