ట్రక్ లో తీసుకొచ్చి హస్కీలను రోడ్ల మీద వదిలేశారా? ఎందుకు?
హైదరాబాద్ మహానగర శివారులో రెండు.. మూడు రోజుల క్రితం అనూహ్య ఘటన చోటు చేసుకుంది.;
హైదరాబాద్ మహానగర శివారులో రెండు.. మూడు రోజుల క్రితం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్కల్ని అల్లారుముద్దుగా పెంచుకునే వారెందరో. అలాంటి వారిలో పలువురు ఇష్టపడే జాతుల్లో ముఖ్యమైనది హస్కీ జాతి కుక్కలు. చల్లని సైబీరియా ప్రాంతానికి చెందిన ఈ జాతి కుక్కలు చూసేందుకు నక్క, తోడేళ్ల మాదిరి కనిపిస్తాయి. కానీ.. చాలా స్నేహపూర్వకంగా ఉండే ఈ కుక్కలు చాలా ఖరీదైనవి. ఎవరైనా హస్కీ జాతి పప్పీలను ఇస్తామంటే.. వెనుకా ముందు చూడకుండానే ఒప్పేసుకుంటారు. హైదరాబాద్ లో క్రాస్ బ్రీడ్ ఇండియన్ హస్కీలను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అయితే.. వీటి ఖరీదు కారణంగా వెనకడుగు వేస్తారు. వీటికి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు చాలా అవసరం.
అలాంటిది హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి - పటాన్ చెరు రోడ్డు సమీపంలో ఇటీవల గుర్తు తెలియన వారు వివరాలేమీ సేకరించలేని విధంగా ఒక వాహనంలో 30-40 వరకు హస్కీ జాతి కుక్కల్ని ఒక కంటైనర్ లో తెచ్చి వదిలేసినట్లుగా చెబుతున్నారు. వేడిని ఏ మాత్రం తట్టుకోలేని.. చల్లదనాన్ని మాత్రం ఇష్టపడే ఈ శునకాలు మండే ఎండల్లో తీవ్ర అవస్థలకు గురయ్యాయి. బాగా నీరసించిపోయాయి. ఒక హస్కీ జాతి కుక్క అయితే ప్రాణాలు కోల్పోయిన దుస్థితి.
అయితే.. ఈ కుక్కల్ని ఎవరు? ఎందుకు వదిలేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. స్థానికులు పలువురు ఈ కుక్కల్ని చూసినా.. వాటిని కొందరు తోడేళ్లుగా మరికొందరు నక్కలుగా భావించారు. ఎందుకంటే వారికి హస్కీ జాతి కుక్కల గురించి అవగాహన లేకపోవటమే. ఇలా రోడ్ల మీద వదిలేసిన హస్కీల్లో ఎక్కువగా రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వయసు ఉన్నవే కావటం గమనార్హం. అంతేకాదు.. ఇవన్నీ శిక్షణ పొందిన శునకాలుగా చెబుతున్నారు.
అలాంటప్పుడు వీటిని రోడ్ల మీద ఎందుకు వదిలేసి వెళ్లారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా జబ్బున పడిపోవటంతో వదిలేశారా? ఇటీవల అక్రమ బ్రీడింగ్ సెంటర్ల మీద అధికారుల నిఘా పెరగటంతో వాటికి భయపడి ఇలా వదిలేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు తప్పించి.. సమాధానాలు దొరకని పరిస్థితి. ఈ హస్కీల దీన పరిస్థితి గురించి తెలిసిన పలు ఎన్జీవోలు స్పందించి రెస్క్యూ చేశాయి. అయితే.. స్థానికులు చెబుతున్నట్లుగా 20-30 హస్కీలు లేవని చెబుతున్నారు. ఇప్పటివరకు ఎనిమిది హస్కీలను మాత్రమే రెస్క్యూ చేశారు.
పూర్తిగా నీరసించిన స్థితిలో ఉన్న హస్కీ జాతి కుక్కల్ని చూసి తమ గుండె తరుక్కుపోయిందని.. వెంటనే స్వాన్ సంస్థతో కలిసి తమ సంస్థ (అసరా) రెండు అంబులెన్సులో వాటిని తీసుకెళ్లి కాపాడినట్లుగా అసరా ఫౌండేషన్ వెల్లడించింది. మిస్ అయినట్లుగా చెబుతున్న మిగిలిన హస్కీల కోసం ఆయా సంస్థల వాలంటీర్లు వెతుకుతున్నారు.ఇదిలా ఉంటే.. వీటిని ఇంత భారీగా ఎందుకు వదిలేశారు? ఎవరు వదిలేశారు? అన్న ప్రశ్నలకు సమాధానాలువెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఈ ఉదంతం ఇప్పుడో పెద్ద మిస్టరీగా మారిందని చెప్పక తప్పదు.