ట్రంప్ - మోడీ చర్చలు మధ్యలో మస్క్
‘అసాధారణం’ లాంటి పరిణామం ఒకటి అంతర్జాతీయ స్థాయిలో జరిగిందా? అంటే.. అవుననే చెబుతోంది తన తాజా కథనంలో న్యూయార్క్ టైమ్స్.;
‘అసాధారణం’ లాంటి పరిణామం ఒకటి అంతర్జాతీయ స్థాయిలో జరిగిందా? అంటే.. అవుననే చెబుతోంది తన తాజా కథనంలో న్యూయార్క్ టైమ్స్. ఇరాన్ తో సాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేయటం.. పలు అంశాలపై చర్చలు జరపటం తెలిసిందే. అయితే.. వీరిద్దరి మధ్య చర్చలకు సంబంధించిన ఒక సంచలన.. ఆసక్తికర అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది అంతర్జాతీయ మీడియా దిగ్గజం న్యూయార్క్ టైమ్స్. ఈ ఇరు దేశాల అధినేతలు మాట్లాడుతుండగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఈ ఫోన్ కాల్ లో జాయిన్ అయినట్లుగా సమాచారం.
తమకు అత్యంత విశ్వసనీయమైన అమెరికా అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారంతో ఈ కథనాన్ని ప్రచురించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ చెప్పటం గమనార్హం. పశ్చిమాసియాలో కొనసాగుతు్న యుద్ధం మీద మోడీతో ట్రంప్ మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన అవసరంపైనా మాట్లాడుకున్నట్లుగా భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ వెల్లడించారు. అయితే.. సాధారణ వ్యక్తిగా మస్క్ ఎందుకు పాల్గొన్నారు? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
ట్రంప్ - మోడీ మధ్య జరిగిన ఫోన్ చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు చేసిన ప్రకటనల్లో మస్క్ ప్రస్తావన లేకపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా తాజా అంశాన్ని తన సంచలన కథనం ద్వారా ప్రపంచానికి చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది మస్క్ కు ట్రంప్ నకు మధ్య విభేదాలు వచ్చినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తాజా కథనం ప్రకారం చూస్తే.. వీరిద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడటమే కాదు.. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఫోన్ చర్చల్లోకి మస్క్ ఎంట్రీ చూస్తే.. దీనికి ట్రంప్ మాత్రమే కాదు మోడీ అంగీకారంతోనే ఇదంతా జరిగే వీలు ఉంటుంది కదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సాధారణంగా రెండు దేశాధినేతల మధ్య జరిగే చర్చలు అత్యంత రహస్యంగా.. కేవలం ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే జరుగుతాయి. కానీ.. తాజా పరిణామం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. హర్మూజ్ మూసివేత కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు.. అంతర్జాతీయ మార్కెట్లకు కలిగే నష్టంపై ఆందోళన వ్యక్తమైనట్లుగా కథనంలో పేర్కొన్నారు. ఈ ఫోన్ చర్చలో మస్క్ పాత్రను వివరిస్తూ.. గల్ఫ్ దేశాలతో ఆయనకున్న వ్యాపార సంబంధాలు.. పశ్చిమాసియాలోని నేతలతో ఉన్న పరిచయాలతో ఒక సలహాదారు తరహాలో ఈ కాల్ లో జాయిన్ అయి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఓవైపు భారత్ లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు.. స్టార్ లింక్ సేవల అమలుకు సంబంధించిన మోడీ సర్కారుతో చర్చలు జరుగుతున్న సమయంలోనే.. ఈ ఉదంతం చోటు చేసుకోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం న్యూయార్క్ కథనంపై వైట్ హౌస్ స్పందించినట్లుగా చెబుతున్నారు. సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వేతర నిపుణుల సలహాలు తీసుకోవటంతో నష్టమేమీ లేదని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ సమావేశంలో మస్క్ జాయిన్ కావటం ఎందుకు అసాధారణంగా మారిందంటే.. ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినప్పుడు విదేశాంగ మంత్రులు.. జాతీయ భద్రతా సలహాదారులు ఉండాలి. అందుకు భిన్నంగా ప్రజాప్రతినిధి కాని మస్క్ లాంటి ఒక కార్పొరేట్ సంస్థ అధినేత అత్యంత రహస్యమైన అంతర్జాతీయ వ్యూహాల చర్చల్లో ఉండటం దౌత్యపరమైన నిబంధనలకు విరుద్ధంగా చెప్పక తప్పదు. ఇప్పటికే పలు అంశాలపై మోడీ విమర్శలు ఎదుర్కొంటున్న వేళలో.. ఈ తరహా సమావేశానికి ఆయన ఓకే చెప్పటం.. ‘విశ్వగురు’ ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు.. ఆయన శక్తిసామర్థ్యాల్ని తక్కువ చేసి చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.