ముప్పయ్యేళ్ళ తరువాత అక్కడకి ముద్రగడ...భారీ స్కెచ్ తోనే ?
ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి రాజకీయంగా ఏడు పదుల వయసులో దూకుడు చూపిస్తున్నారు.;

ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి రాజకీయంగా ఏడు పదుల వయసులో దూకుడు చూపిస్తున్నారు. ఇటీవలే ఆయనకు వైసీపీ అధినేత జగన్ పీయేసీలో మెంబర్ గా అవకాశం ఇచ్చారు. దాంతో పాటుగా ఆయన అనుభవాన్ని సేవలను రాష్ట్రంలో పార్టీ ఎదిగేందుకు ఉపయోగించుకుంటామని కూడా చెప్పారు. దానికి సానుకూలంగా స్పందించిన ముద్రగడ జగన్ కి లేఖ కూడా రాశారు. మళ్ళీ ఏపీలో జగన్ ని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తాను అని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే గోదావరి జిల్లా రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న ముద్రగడ ఇపుడు తన అస్త్రశస్త్రాలు మరోసారి బయటకు తీస్తున్నారు. ఆయన ఈసారి వైసీపీ కోసమే కాకుండా తన కుమారుడి కోసం కూడా రంగంలోకి దిగుతున్నారు. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ అధినాయకత్వం పత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది.
ఆ నియోజకవర్గం ముద్రగడ కుటుంబానికి రాజకీయంగా జన్మస్థానం వంటిది. ముద్రగడ తండ్రి వీర రాఘవ రావు 1962, 1967లలో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచారు. ఆయన తరువాత వారసుడిగా వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ తరఫున ఇదే సీటు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన వరసగా మూడు సార్లు గెలిచారు.
కానీ 1994లో ప్రత్తిపాదులో ముద్రగడ ఓటమి చెందారు. దాంతో ఆయన ఆగ్రహించి ఇక మీదట అక్కడ నుంచి పోటీ చేయను అని ఒక శపధం చేశారు. 1999లో ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయనకు అధికార పదవులు దక్కలేదు. ఈ మధ్యలో ఆయన ఎంచుకున్న మరో అసెంబ్లీ సీటు పిఠాపురం గా ఉంది. అక్కడ నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
ఇక చూస్తే ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన చూపు అంతా కుమారుడు గిరి గురిచే ఉంది. తాను తన తండ్రి గెలిచిన ప్రత్తిపాడు నుంచి కుమారుడిని 2029లో గెలిపించుకోవాలన్న తపనతో ఆయన మళ్ళీ ప్రత్తిపాడులో పనిచేస్తున్నారు. ఆ విధంగా ఆయన ప్రత్తిపాడులో వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు.
ఇక ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చూస్తున్నారు. ముద్రగడ ప్రత్తిపాడులో రీ ఎంట్రీ మీద ఆమె హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వదిలేసిన నియోజకవర్గం మీద మళ్ళీ ప్రేమ ఎందుకని అంటున్నారుట. ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కావాలి కానీ ప్రజా సమస్యల కోసం కాదని సెటైర్లు వేస్తున్నారు.
మరో వైపు వైసీపీ నుంచి 2014లో గెలిచిన వరుపుల సుబ్బారావు, 2019లో గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఇద్దరూ నియోజకవర్గంలో తనకంటూ కొంత వర్గం కలిగిన వారు. వారు సైలెంట్ కావడంతో ఆ వర్గాన్ని వరుపుల సత్యప్రభ తన వైపునకు తిప్పుకుంటున్నారు. మరో వైపు ముద్రగడ టీడీపీ యాంటీ వర్గాన్ని చేరదీసి వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు.
మొత్తం మీద చూస్తే కనుక 2029 ఎన్నికల్లో వరుపుల వర్సెస్ ముద్రగడల మధ్య భీకర రాజకీయ యుద్ధమే సాగనుంది అని అంటున్నారు. తాత తండ్రి గెలిచిన ప్రత్తిపాడులో ముద్రగడ గిరి తన సత్తా చాటుతారా అన్నది చూడాలి. అంతే కాదు మూడు దశాబ్దలా తరువాత ముద్రగడ పద్మనాభం తన ప్రతాపం సొంత ఇలాకాలో చూపుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది.