ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై దుమారం.. అసలేంటి ఆ వ్యాఖ్యలు..

భారత రాజకీయ వేదిక మళ్లీ ఒక సున్నిత అంశం చుట్టూ తిరుగుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-10-20 08:15 GMT

భారత రాజకీయ వేదిక మళ్లీ ఒక సున్నిత అంశం చుట్టూ తిరుగుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కూతురు హిందూయేతర పురుషుడితో వెళ్లాలనుకుంటే.., తల్లిదండ్రులు కాళ్లు విరగొట్టాలి’ అన్నారు. ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా మత, సామాజిక వర్గాల్లో తీవ్ర స్పందనకు దారి తీసింది. ఒక రిలీజియన్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల తుఫాను చెలరేగింది.

సంప్రదాయాలను చిన్ననాటి నుంచే వివరించాలి..

‘మన సంప్రదాయాలు, విలువలు చిన్నప్పటి నుంచే పిల్లలకు బోధించాలి. వారు తప్పు దారిలో నడిస్తే, వారిని కొట్టినా తప్పులేదు అని ఆమె సూచించారు. వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించాలి’ అన్నారు. ఇది క్రమశిక్షణ పిలుపు లాగానే అనిపిస్తుంది, కానీ ‘హిందూయేతర పురుషుడితో వెళ్లాలనుకుంటే సహించవద్దు, కాళ్లు విరగొట్టాలి’ అదే వాదనను హింస వైపు మళ్లిస్తుంది.

ఆమె పిలుపు వెనుక దాగున్నది ఇదేనా..?

ఈ వ్యాఖ్య ప్రజ్ఞా ఠాకూర్ సొంత అభిప్రాయమే అయినా.. దాని వెనుక ఉన్న మనస్తత్వం ఒక సమాజపు ప్రతిబింబం. హిందూ సంస్కృతిలో ‘ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం’ అని చెప్పే విలువలను ఆమె ప్రస్తావించారు. కానీ ఆ విలువల్లో వారి స్వతంత్రతను నిరాకరించే సూత్రం దాగి ఉందని విమర్శకులు అంటున్నారు. ‘లక్ష్మీగా చూస్తాం’ అనే మాట స్త్రీకి గౌరవం ఇస్తున్నట్టే అనిపించినా.. ఆ గౌరవం ఒక నియంత్రణగా మారినప్పుడు అది స్వాతంత్ర్యం కాదు అది బంధించడం అవుతుంది.

యువతరానికి సంకెళ్లు..

నేడు దేశంలో యువతరానికి ప్రేమ, వివాహం వంటి విషయాల్లో స్వేచ్ఛ పెరుగుతున్న తరుణంలో.. ఇటువంటి వ్యాఖ్యలు వారి మధ్య విభేదాలను పెంచవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఆధునికత, సంప్రదాయం మధ్య పోరు దేశం ఎదుర్కొంటున్న సాంఘిక సత్యం. ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్య ఆ పోరును మళ్లీ ప్రస్తుతానికి తీసుకువచ్చింది.

ఇది కేవలం ఒక మతపరమైన వాదం కాదు, ఒక సాంస్కృతిక అసహనానికి సూచన. ఒక తరం ‘పిల్లలపై హక్కు’ పేరుతో నియంత్రణ చూపాలని కోరుకుంటే, మరో తరం ‘నా జీవితంపై హక్కు నాకు ఉంది’ అని చెబుతోంది. ఈ విభేదం సమాజంలో మౌనంగా ఒక యుద్ధాన్ని సృష్టించగలదు.

చట్టపరమైన స్వేచ్ఛను అడ్డుకోవడమే..

హిందూయేతర పురుషులతో సంబంధం పెట్టుకున్న ఆడపిల్లలపై హింస చూపాలని ప్రోత్సహించడం కేవలం మతం పట్ల అపకీర్తి కాదు.. అది చట్టపరమైన నేరం కూడా. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఇస్తుంది. మతం, జాతి, కులం అనే అడ్డంకులు ఈ హక్కును చట్టపరంగా అడ్డుకోలేవు. అందువల్ల ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యలు చట్ట, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉంది.

ఆమె చెప్పిన మరో పాయింట్‌ ‘మన సంప్రదాయాల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి’. ఒకప్పుడు ఆడపిల్ల బయట చదువుకోవడమే అసహజంగా కనిపించింది. నేడు అదే చదువు ఆమె భవిష్యత్తు రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. సంప్రదాయం అంటే ఆపివేయడం కాదు, సంరక్షిస్తూ అభివృద్ధి చేయడం.

ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యలు దేశంలో చర్చను రేపాయి. మనం మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాం? గౌరవమా, లేక భయమా? అదే ప్రశ్న ఈ సమాజం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.

Tags:    

Similar News