ఆ రైతు ఆదాయం నెలకు పావలా.. ఏడాదికి రూ.3.. ఏమిటిది?

అవును... మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ రైతు వార్షిక ఆదాయం కేవలం మూడు రూపాయలుగా పేర్కొంటూ అధికారులు ఆదాయ ధ్రువపత్రం జారీ చేశారు.;

Update: 2025-07-27 19:27 GMT

ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే బిల్లులు, సర్టిఫికెట్లలో అప్పుడప్పుడూ కొన్ని "అద్భుతాలు" కనిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... ఇంట్లో ఒక ఫ్యాను, ఒక లైటు ఉన్నలక్షల్లో కరెంటు బిల్లులు రావడం వంటివన్నమాట! ఈ క్రమంలో ఓ రైతు వార్షిక ఆదాయం కేవల రూ.3 అనే విషయం అధికారులు జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికెట్ లో కనిపించడం గమనార్హం.

అవును... మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ రైతు వార్షిక ఆదాయం కేవలం మూడు రూపాయలుగా పేర్కొంటూ అధికారులు ఆదాయ ధ్రువపత్రం జారీ చేశారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ సందర్భంగా... దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇతడు అత్యంత పేద వ్యక్తి అంటూ నెటిజన్లు పోస్టులు మొదలుపెట్టారు. ఈ సమయంలో అధికారులు స్పందించారు.

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ లోని సత్నా జిల్లా కోఠీ మండలానికి చెందిన రామ్‌ స్వరూప్‌ అనే రైతు ఇటీవల ఆదాయ ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో.. జులై 22న అతనికి అధికారులు సర్టిఫికెట్ జారీ చేశారు. దానిపై స్థానిక తహసీల్దార్‌ సౌరభ్‌ ద్వివేదీ సంతకం చేశారు. అప్పుడు అసలు కథ తెరపైకి వచ్చింది.

ఆ సర్టిఫికెట్ అందుకున్న అనంతరం తన ఏడాది ఆదాయం రూ.3 ఉండటంపై రైతు కంగుతిన్నాడు. అంటే... అధికారుల లెక్కల ప్రకారం సదరు రైతు ఆదాయం నెలకు పావలా (25 పైసలు) అన్నమాట. ఈ నేపథ్యంలో... ఈ సర్టిఫికేట్‌ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మొదలుపెట్టింది. నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడట మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు.. ఈ సందర్భంగా అసలు విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా.. అది క్లరికల్‌ పొరపాటని.. టైపింగ్ మిస్టేక్ అది తప్పుగా పడిందని వెల్లడించారు. ఈ సమయంలో జులై 25న కొత్త ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. అందులో అతడి ఏడాది ఆదాయం రూ.30 వేలుగా పేర్కొన్నారు.

దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ సందర్భంగా... దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కాపీని పోస్ట్ చేస్తూ... ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ పాలనలో దేశంలోనే అత్యంత పేద వ్యక్తిని కనుగొన్నామని.. ఆయన వార్షిక ఆదాయం కేవలం మూడు రూపాయలు మాత్రమే అని.. ఇది ప్రజలను పేదలుగా చేసే ప్రయత్నమా? అంటూ మండిపడింది.

Tags:    

Similar News