రోడ్డు వేయమన్న మహిళల్ని డెలివరీ డేట్ చెప్పాలనటమా?
పదవులు వచ్చిన తర్వాత కళ్లు నెత్తికెక్కే నాయకులు చాలామందే కనిపిస్తారు. ఆ కోవలోకే చెందుతారు మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ.;
పదవులు వచ్చిన తర్వాత కళ్లు నెత్తికెక్కే నాయకులు చాలామందే కనిపిస్తారు. ఆ కోవలోకే చెందుతారు మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ. ఆయన బలుపు మాటలు ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారాయి. తమ ఊరికి రోడ్డు వేయాలని.. ఏడాది క్రితం రోడ్డు వేయిస్తానన్న పెద్దమనిషి.. తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోని వైనాన్ని ప్రశ్నించిన మహిళల్ని ఎటకారం ఆడిన వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లాకు చెందిన ఒక గ్రామానికి చెందిన మహిళలు.. తమ ఊరికి వచ్చిన బీజేపీ ఎంపీ రాజేశ్ మిశ్రను నిలదీశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆ గ్రామానికి చెందిన పాతికేళ్ల లీలా సాహు.. తమ ఊరికి వచ్చిన ఎంపీని ప్రశ్నించారు. రోడ్డు వేస్తామని ఏడాది క్రితం హామీ ఇచ్చారని.. ఇప్పటికి చెప్పిన మాటను నిలెబెట్టుకోలేదన్నారు. తనతో పాటు గ్రామంలో మరో ఐదుగురు మహిళలు గర్భవతులుగా ఉన్నారని.. తమ ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఆసుపత్రికి వెళ్లటం ఇబ్బందిగా ఉందన్నారు.
తన డెలివరీ తర్వాత తమ ఊరికి రోడ్డు లేని విషయాన్ని ఢిల్లీకి వెళ్లి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దీంతో బీజేపీ ఎంపీ రాజేశ్ మిశ్రాకు కోపం వచ్చింది. లీలా వేస్తున్న ప్రశ్నలకు సూటి సమాధానం చెప్పకుండా.. మీ డెలివరీ డేట్స్ ఏమిటో చెబితే వారం ముందే ఆసుపత్రికి తరలిస్తామని పేర్కొన్నారు. ఊరికి అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని.. డెలివరీ డేట్ చెబితే ముందే ఆసుపత్రిలో చేరుస్తామన్న ఆయన.. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు ఇలాంటి ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించటం చూస్తే.. ఊరి కోసం అడిగిన రోడ్డును వేయించాల్సింది పోయి.. అనవసరమైన పంచాయితీలు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.