రిపోర్టు: వానల్లోనూ టూర్లకు సై.. జెన్ జీ లెక్కే వేరు
అందరిలా ఉంటే స్పెషల్ ఏముంటుంది? అందరికి అసౌకర్యంగా భావించే వేళల్లో టూర్లకు వెళ్లేటోళ్లు ఉంటారా? అంటే ఉంటారని చెబుతోంది తాజాగా విడుదలైన రిపోర్టు.;
అందరిలా ఉంటే స్పెషల్ ఏముంటుంది? అందరికి అసౌకర్యంగా భావించే వేళల్లో టూర్లకు వెళ్లేటోళ్లు ఉంటారా? అంటే ఉంటారని చెబుతోంది తాజాగా విడుదలైన రిపోర్టు. సాధారణంగా టూర్లకు వెళ్లాలంటే వర్షాకాలంలో మక్కువ చూపరు. సౌకర్యంతో పాటు.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండని రోజుల్లో వీలైనంతవరకు టూర్లకు పుల్ స్టాప్ పెడుతుంటారు.
అయితే.. జెన్ జీ.. మిలీనియల్స్ మాత్రం అందుకు మినహాయింపుగా చెబుతోంది తాజా రిపోర్టు. వర్షాకాలంలో ఆహ్లాదకర వాతావరణాన్ని అస్వాదిస్తూ.. అందమైన ప్రదేశాల్ని చుట్టేసేందుకు అస్సలు వెనక్కి తగ్గట్లేదు. తక్కువ ఖర్చు.. రద్దీ లేని ప్రదేశాల్ని వారు ఎంపిక చేసుకుంటున్నారు. బ్యాక్ వాటర్స్ నుంచి వైల్డ్ లైఫ్ సఫారీలు.. బైకింగ్ ట్రయల్స్.. ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఆయుర్వేద చికిత్సల వరకు డిస్కౌంట్ ప్రైజ్ లలో లభిస్తున్న కారణంగా యూత్ టూర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా థామస్ కుక్ చెబుతోంది.
మాన్ సూన్ టూర్లకు ఇటీవల కాలంలో ఆసక్తి పెరిగినట్లుగా చెబుతున్నారు. జెన్ జీ తో పాటు.. మిలీనియల్స్ .. దంపతులు.. ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. మెట్రో నగరాలే కాకుండా టూ టైర్.. త్రీ టైర్ నగరాలను పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ వ్యవధిలో పూర్తయ్యే ట్రిప్పుల మీద ఆసక్తి పెరుగుతోంది. వీకెండ్ లలో బయటకు వెళ్లటం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. వీకెండ్ టూర్లలో 46 శాతం పెరుగుదల కనిపించినట్లుగా క్లియర్ ట్రిప్ చెబుతోంది.
గిరాకీ అనుగుణంగా విమాన ఛార్జీలు పెరుగుతున్నా.. హోటల్ అద్దెలు మాత్రం పెరగకపోవటం కాస్త ఉపశమనంగా ఉన్నట్లు చెబుత్నారు. ఈ ఏడాది వానాకాలంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటున్న విషయాన్ని పలు పోర్టళ్లు చెబుతున్నాయి. గత ఏడాది వర్షాకాలంతో పోలిస్తే ఈ ఏడాది వర్షాకాలంలో విమాన టికెట్ల బుకింగ్ 25-30 శాతం పెరిగాయని.. పోర్ట్ బ్లెయిర్..తిరుపతి.. ఉదయ్ పుర్..కోయంబత్తూర్.. డెహ్రాడూన్ లాంటి ప్రదేశాలకు గిరాకీ పెరిగినట్లుగా చెబుతున్నారు. ఏమైనా రోటీన్ కు భిన్నంగా ఎంజాయ్ చేయటంతో జెన్ జీ.. మిలియనీల్స్ ముందుంటారని చెప్పక తప్పదు