సెంటిమెంట్ కే సవాలు: అక్కడ రాత్రి బస చేసిన సీఎం!
అయినప్పటికీ తాజాగా సీఎం అయిన మోహన్ యాదవ్ సెంటిమెంట్ కు సవాలు విసురుతూ..ముఖ్యమంత్రి హోదాలో ఉజ్జయినిలో రాత్రి బస చేశారు.
జరుగుతుందో లేదో అన్న సందేహం ఉంటే ఫర్లేదు. కానీ.. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు పోయిన ఉదంతాలు కళ్ల ముందు కనపడుతున్నా.. వాటిని పట్టించుకోకుండా సీఎం అయిన వారానికే సెంటిమెంట్ కు సవాలు విసిరారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ మధ్యనే ప్రమాణస్వీకారం చేసిన మోహన్ యాదవ్. ఉజ్జయిని ఎమ్మెల్యేగా సుపరిచితుడైన ఆయన.. ముఖ్యమంత్రి అవుతారని కలలో కూడా అనుకోలేదు. ఆ మాటకు వస్తే.. ఆయన కూడా ఎప్పుడు అనుకోలేదని చెబుతారు. ఇదిలా ఉంటే.. ఉజ్జయిని సెంటిమెంట్ ఏమిటన్నది చూస్తే..
ఉజ్జయిని నగరంలో రాజు కానీ.. పాలకుడు ఎవరూ కూడా రాత్రిళ్లు బస చేయకూడదు. రాజకీయంగా అత్యున్నత పదవిలో ఉన్న వారు ఉజ్జయినిలో రాత్రిళ్లు బస చేస్తే.. వారి పదవులు పోతాయన్నది నమ్మకం. ఇప్పటికే పలువురు నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయినప్పటికీ తాజాగా సీఎం అయిన మోహన్ యాదవ్ సెంటిమెంట్ కు సవాలు విసురుతూ..ముఖ్యమంత్రి హోదాలో ఉజ్జయినిలో రాత్రి బస చేశారు.
శనివారం రాత్రి ఉజ్జయినిలో నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. ఈ సెంటిమెంట్ మీదా మాట్లాడారు. కొన్ని కారణాలతో 1812లో సింధియా రాజ్యం రాజధాని ఉజ్జయిని నుంచి గ్వాలియర్ కు మారిందని.. ఏ ఒక్క రాజూ ఉజ్జయినిలో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ తరహా సంప్రదాయాన్ని తెర మీదకు తెచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాన్ని ఎవరూ అక్రమించుకోకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రచారం చేస్తుండేవారన్నారు.
ఈ సెంటిమెంట్ కేవలం రాజకీయ వ్యూహంగా చెప్పిన ఆయన.. తన మాటలకు తగ్గట్లే ఉజ్జయినిలో రాత్రి వేళ బస చేశారు. ఉజ్జయిని క్షేత్ర పాలకుడైన మహాకాలేశ్వరుడు అందరికీ రాజుగా పేర్కొన్న ఆయన.. "మనమంతా ఆయన పిల్లలమే. మహాకాలుడి అధికారాలు కేవలం ఉజ్జయిని నగర పాలక సంస్థ పరిధికి మాత్రమే పరిమితం అవుతాయా? ఆయన కరుణ లేకుండా ఏ వ్యక్తీ.. ఈ విశ్వంలో మనుగడ సాగించలేరు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి ఉజ్జయినిలో బస చేసిన ముఖ్యమంత్రి ఫ్యూచర్ ఎలా ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి రిస్కులు సీఎంగా బాధ్యతలు చేపట్టినంతనే కాకుండా.. కాస్తంత గ్యాప్ తీసుకొని చేసి ఉంటే మరింత బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరేం జరుగుతుందో కాలమే తేల్చాలి.