తప్పుకోవాలంటున్న ఆర్ఎస్ఎస్...మోడీ గురించేనా ?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ షార్ట్ కట్ లో ఆర్ఎస్ఎస్. వందేళ్ళ ఈ సంస్థకు ఎన్నో అంగాలు ఉన్నాయి అందులో రాజకీయ అంగమే బీజేపీ.;
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ షార్ట్ కట్ లో ఆర్ఎస్ఎస్. వందేళ్ళ ఈ సంస్థకు ఎన్నో అంగాలు ఉన్నాయి అందులో రాజకీయ అంగమే బీజేపీ. బీజేపీ విధి విధానాలను శాసించేది ఆర్ఎస్ఎస్ అన్నది అంతా అంటారు. ఈ రోజున బీజేపీలో ఉన్న కీలక నాయకులు అంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్, తెలుగు నాట చూస్తే వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి వంటి వారు అంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే.
ఆర్ఎస్ఎస్ అంటే మార్గదర్శిగా బీజేపీ భావిస్తుంది. అలాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన కామెంట్స్ చేశారు. వయసు ఏడున్నర పదులు దాటితే ఆ నాయకులు ఇక విశ్రాంతి తీసుకోవాలని కొత్త వారిని బాధ్యతలు అప్పగించాలని మోహన్ భగవత్ అన్నారు.
మనకు ఎవరైనా 75 ఏళ్ళ వయసు వచ్చిందని శాలువా కప్పారు అంటే ఇక గౌరవంగా తప్పుకోమని అర్థమని కూడా ఆయన చెప్పారు. వయసు పెరిగాక రాజకీయ నాయకులు హుందాగా తప్పుకోవాలని ఇతరులకు దారి చూపించాలని ఆయన కోరారు.
ఆయన ఈ విధంగా చేసిన కామెంట్స్ ఇపుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఆయన జనరల్ గా అన్నా కూడా అందరి కంటే ఎక్కువగా బీజేపీకే అవి వర్తిస్తాయని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఆయన మార్గదర్శకత్వం చేసేది బీజేపీకే కాబట్టి ఆ పార్టీ నాయకులకే ఈ వ్యాఖ్యలు శిరోధార్యంగా ఉండాల్సి ఉంటుందని అన్నారు.
ఈఅ మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలిస్తే కనుక ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రస్తుతం వయసు 74 ఏళ్ళు. ఈ ఏడాది సెప్టెంబర్ 17తో ఆయనకు 75 ఏళ్ళు నిండుతాయి. అంటే ఆ ఏజ్ వచ్చాక స్వయంగా మోడీ ప్రధాని పీఠం నుంచి తప్పుకుని ఇతరులకు అది అప్పగించాలని పరోక్షంగా సూచించారా అన్న చర్చ అయితే సాగుతోంది.
అయితే ఈ విషయంలో బీజేపీ నేతలు మాత్రం జనరల్ గా చేసిన వ్యాఖ్యలుగానే చూస్తున్నారు. ఇక బీజేపీలో చూస్తే చాలా మంది నాయకులను 75 ఏళ్ళు మీరారు అని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించకుండా గతంలో తప్పించారు అని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ఈ రోజున ఈ రూపంలో ఉంది అంటే దానికి అన్ని విధాలుగా నారూ నీరూ పోసిన వరిష్ట నేత ఎల్ కే అద్వానీని 75 దాటారు అనే 2019లో లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని అంటున్నారు. అలాగే మరో సీనియర్ నేత బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అయిన మురళీ మనోహర్ జోషీ విషయంలోనూ పక్కన పెట్టారని అంటున్నారు.
ఇలా చాలా మందిని వయసు కారణంగా పార్టీ సేవలకు దూరంగా ఉంచిన ఈ నిబంధన ఇపుడు బీజేపీలో నడుస్తోందా అంటే లేదని అన్న వారే ఎక్కువగా ఉన్నారు. మోడీతోనే బీజేపీ అన్నట్లుగా ఇపుడు పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే మోడీయే బీజేపీ అన్నట్లుగా కూడా ఉందని అంటారు. దాంతో మోడీకి ఈ నిబంధన వర్తించదని అంటున్న వారూ ఉన్నారు. అంతే కాదు బీజేపీలో వయసు నిబంధన ఏదీ లేదని చెబుతున్నారు.
అయితే మోహన్ భగవత్ అన్నది మాత్రం అందరి గురించేనా లేక మోడీ గురించా అన్నది అయితే చర్చగా ఉంది. బీజేపీలో ఒకనాడు 75 ఏళ్ళ విధానం అమలు చేసి ఇపుడు కాదు మాకు లేదు అంటే దానిని సమర్ధించుకోవడమూ కష్టమే అని అంటున్నారు. మోడీ ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా ఉన్నారు.
అయితే ఆయనకు ఈ టెర్మ్ లో అయితే మధ్యలో విరమించుకోవడం వంటిది ఉండకపోయినా 2029 నాటికి మాత్రం ఆయన ప్రధాని అభ్యర్ధి కారు అన్నది చెప్పాలన్నదే ఈ వ్యాఖ్యల ఉద్దేశ్యమా అని కూడా విశ్లేషించేవారు ఉన్నారు. ఏది ఏమైనా మోడీ మరింత కాలం ప్రధానిగా ఉంటారని బీజేపీలో వాదన ఉంది. మోడీ ఎపుడు కావాలనుకుంటే అపుడే రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా అంటున్నారు. ఇక చూస్తే కనుక బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి ఏమైనా గ్యాప్ ఉందా లేదా అన్నది ఈ వ్యాఖ్యల తరువాత జరిగే పరిణామాల బట్టి అర్ధం అవుతుందని కూడా అంటున్నారు.