నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిసిటీ ఖర్చు 3వేల కోట్లకు పైనే!

ప్రభుత్వాలకూ, పార్టీలకూ పబ్లిసిటీ ముఖ్యమే కానీ, పబ్లిసిటీ మాత్రమే ముఖ్యం కాదు అని అంటుంటారు. మరికొంతమందికి పినతల్లికి కోక పెట్టినా పోస్టర్స్ వేయించుకుంటారని చెబుతుంటారు.;

Update: 2023-07-24 05:06 GMT

ప్రభుత్వాలకూ, పార్టీలకూ పబ్లిసిటీ ముఖ్యమే కానీ, పబ్లిసిటీ మాత్రమే ముఖ్యం కాదు అని అంటుంటారు. మరికొంతమందికి పినతల్లికి కోక పెట్టినా పోస్టర్స్ వేయించుకుంటారని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఏడాది కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రకటనల కోసం వెచ్చించిన వివరాలు విడుదలయ్యాయి.

అవును... కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018 నుంచి ప్రకటనల కోసం వెచ్చించిన వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా... 2018-19 నుంచి ఇప్పటి వరకు తన పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం చేసిన ఖర్చు రూ.3,064.42 కోట్లు అని తేలింది. ఈ మొత్తం ప్రింట్ మీడియా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత... 2018-19 నుంచి 2023-24 మధ్య ఈ ఏడాది జూలై 13 వరకు ప్రింట్ మీడియాపై రూ.1,338.56 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాపై రూ.1,273.06 కోట్లు, బహిరంగ ప్రచారానికి రూ.452.80 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించింది.

వీటిలో సంవత్సరాల వారీగా చూసుకుంటే... 2018-19 నుంచి మొత్తం ఖర్చు రూ. 1,179.16 కోట్లు ఉండగా.. 2019-20లో ప్రకటనల వ్యయం రూ.708.18 కోట్లుగా ఉంది. ఇది 2020-21లో రూ. 409.47 కోట్లకు, 2021-22లో రూ. 315.98 కోట్లకు క్షీణించింది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై 13 మధ్య ప్రభుత్వం ప్రకటనల కోసం రూ.43.16 కోట్లు ఖర్చు చేసింది. ప్రింట్ మీడియా కంటే 2018-19, 2019-20 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ వాటాను కలిగి ఉందని డేటా విశ్లేషణలో తేలింది. ఇందులో భాగంగా... 2018-19లో ప్రింట్ మీడియా రూ. 429.55 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.514.29 కోట్ల విలువైన ప్రకటనలు వచ్చాయి.

ఇక, 2020-21లో ఎలక్ట్రానిక్ మీడియా రూ. 167.90 కోట్లు కాగా, ప్రింట్ మీడియాకు రూ. 197.49 కోట్లు చెల్లించింది. ఇదే సమయంలో 2021-22లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు వరుసగా రూ.101.24 కోట్లు, రూ.220.34 కోట్లు చెల్లించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ప్రింట్ కోసం రూ. 17.09 కోట్లు కాగా, రూ. 17.37 కోట్లు మీడియా కోసం వెచ్చించారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అబిర్ రంజన్ బిశ్వాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలు వెల్లడించారు.

ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఐదేళ్లలో విదేశీ పర్యటనలకు రూ.2,54,87,01,373 (రూ.254.87 కోట్లు) ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ తెలిపారు. 2019 ఆగస్టు నుంచి తొమ్మిది దేశాల్లో ప్రధాని పర్యటించారని చెప్పారు.

Tags:    

Similar News