పవన్ కు బాబు రిక్వెస్ట్.. మోదీ టూర్ తో మారిన రాజకీయం!

ఈ నెల 16న ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. దీంతో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు;

Update: 2025-10-06 11:57 GMT

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ నెల 16న ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. దీంతో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశానికి వర్చువల్ గా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రిక్వెస్ట్ చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుంది, కానీ, పవన్ పర్యవేక్షిస్తున్న అటవీశాఖకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం తీసుకునే విషయంలో పర్యావరణ ప్రేమికుడు అయిన పవన్ కు వ్యక్తిగతంగా సీఎం రిక్వెస్ట్ చేయడం విశేషంగా చెబుతున్నారు.

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద క్షేత్రమైన శ్రీశైలంలో తిరుమల తరహాలో భక్తులకు సదుపాయాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధిపై మంత్రులు పవన్ కల్యాణ్, ఆనం రామనారాయణరెడ్డితో ముఖ్యమంత్రి చర్చించారు.

అయితే అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం దేవాలయ అభివృద్ధికి 2 వేల హెక్టార్ల అటవీ భూమి అవసరం ఏర్పడింది. అటవీ చట్టాలు ఇందుకు ప్రతిబంధకంగా మారడంతో సీఎం రంగంలోకి దిగారు. అటవీ మంత్రి పవన్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయరెడ్డితో ఒకేసారి చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కట్టుదిట్టమైన అటవీ చట్టాలను సమీక్షించి దేవాదాయశాఖకు భూ కేటాయింపు చేయడం కత్తిమీద సాముగా చెబుతున్నారు. సవాల్ తో కూడుకున్న ఈ పనిని పూర్తి చేసేందుకు అటవీ మంత్రి అయిన పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకోసం కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు.

Tags:    

Similar News