దక్షిణాదికి సీట్లు తగ్గుతాయా... మోడీ క్లియర్ కట్ స్టేట్మెంట్ !

దేశంలో ప్రస్తుతం లోక్ సభ సీట్ల పునర్ వ్యవస్థీకరణ మీద తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయ పార్టీల్ మధ్యనే కాదు జన సామాన్యంలోనూ ఈ చర్చ ఉంది.;

Update: 2026-04-05 03:34 GMT

దేశంలో ప్రస్తుతం లోక్ సభ సీట్ల పునర్ వ్యవస్థీకరణ మీద తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయ పార్టీల్ మధ్యనే కాదు జన సామాన్యంలోనూ ఈ చర్చ ఉంది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల మధ్య ఈ చర్చ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీట్లు తక్కువ. జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన ఈ రాష్ట్రాలు కేంద్రం అనుసరించబోయే విధానంలో సీట్లు తగ్గ్గిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. జనాభా ప్రాతిపదికన కొలమానంగా తీసుకుని కనుక చేస్తే మాత్రం తీవ్ర అన్యాయం సౌతర్న్ స్టేట్స్ కే అన్న మాట కూడా ఉంది.

మోడీ కీలక వ్యాఖ్యలు :

అయితే ఈ విషయం మీద కేరళలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఒక స్పష్టత ఇచ్చారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళనలపై తొలిసారిగా స్పందించిన ప్రధాన మంత్రి మోదీ లోక్ సభ సీట్ల సంఖ్య ఏ మాత్రం తగ్గిపోదని అన్నారు. అయితే, అది సంపూర్ణ సంఖ్యల వారీగానా లేక దామాషా వారీగానా అనేది ఆయన స్పష్టం చేయలేదు. జనాభా నియంత్రణం పాటించిన దక్షిణాది రాష్ట్రాలు తమ లోక్‌సభ సీట్లను అసలు కోల్పోవని మోడీ అన్నారు. పైగా ప్రతిపాదిత లోక్‌సభ సీట్ల పెంపు వల్ల అన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని అన్నారు.

ఆందోళన వద్దు అంటూ :

సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోడీ భరోసా ఇచ్చారు. ఈ సమస్యను సాఫీగా సామరస్యంగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలనుకుంటుందని నరేంద్ర మోడీ అన్నారు. జనాభా నియంత్రణ రంగంలో కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాలు అద్భుతమైన పని తీరు కనబరిచాయి అని ఆయన గుర్తు చేశారు. ఇదే సమయంలో జనాభా అక్కడ తక్కువగా నమోదు అయిందని అన్నారు. దాంతో ఈ రాష్ట్రాలలో పార్లమెంటరీ సీట్ల కేటాయింపు తగ్గుతుందని కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మోడీ ఆగ్రహించారు.

భరోసా ఇవ్వబోతున్నాం :

ఈ రకమైన తప్పుడు సమాచారంతో ఆందోళన చెందే రాష్ట్రాలకు ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంటులో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వాలనుకుంటోందని ఆయన చెప్పారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా లేదా తెలంగాణ వంటి ఏ రాష్ట్రంలోనూ లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గించమని ఆయన చెప్పారు. అంతే కాదు ఈ హామీని చట్టం ద్వారానే నిర్ణయిస్తామని అన్నారు

మహిళా రిజర్వేషన్ ఘనత :

దేశంలో చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని మోడీ చెప్పారు. పార్లమెంటు మూడు రోజుల పాటు ఈ నెల 16, 17 18 తేదీలలో సమావేశం కానుందని మోడీ చెప్పారు. ఈ ప్రత్యేక సమావేశాలలో కేంద్రం పూర్తి చేయాల్సిన రెండు నిర్దిష్టమైన కీలక విషయాల్లో ఒకటి లోక్ సభ సీట్ల పునర్ వ్యవస్థీకరణ, రెండు మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ల కోసం అదనపు స్థానాలుగా సృష్టించేలా చూడటం అని ఆయన చెప్పారు. దీని వల్ల ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు ఎక్కువ మేలు జరుగుతుందని మోడీ చెప్పారు.

Tags:    

Similar News