భారత్‌లో ఒలింపిక్స్.. ప్రధాని మోదీ అతి పెద్ద‌ క‌ల‌ నెరవేరాలంటే?

అయితే ప్రధాని ఆకాంక్ష నెరవేరి భారతదేశం ఒలింపిక్స్‌కు విజయవంతంగా ఆతిథ్యం ఇవ్వాలన్నా.. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ పతకాల పంట పండించాలన్నా కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే సరిపోదు.

Update: 2026-05-16 22:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో పర్యటిస్తూ హేగ్‌ నగరంలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన సమావేశంలో దేశ భవిష్యత్తుపై తనకున్న నాలుగు బలమైన కోరికలను (ఆశయాలను) షేర్ చేసారు. భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదగాలని.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారాలని.. గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్‌ను భారత్ ముందుండి నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. వీటితో పాటు అన్నింటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో ప్రతిష్టాత్మక `ఒలింపిక్ క్రీడల`కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలనేది తన అతిపెద్ద కల అని ప్రధాని మోదీ ఈ వేదికపై ప్రకటించారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్ట్-అప్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న భారత్.. ఏఐ సమ్మిట్, జీ20 సమిట్‌లను విజయవంతంగా నిర్వహించిన తరహాలోనే ఒలింపిక్స్‌ను కూడా నిర్వహించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే ప్రధాని ఆకాంక్ష నెరవేరి భారతదేశం ఒలింపిక్స్‌కు విజయవంతంగా ఆతిథ్యం ఇవ్వాలన్నా.. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ పతకాల పంట పండించాలన్నా కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే సరిపోదు. చైనా వంటి పొరుగు దేశాల తరహాలో భారతదేశంలో క్రీడా ప్రతిభను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ప్రధాని మోదీ సహా మన దేశ పాలకులపై ఉంది. ఒలింపిక్ క్రీడలను సొంత గడ్డపై నిర్వహించే స్థాయికి దేశం ఎదగాలంటే ముందుగా క్రీడారంగంలో నిజమైన ప్రతిభకు పెద్దపీట వేసేలా పారదర్శక విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేటికీ మన క్రీడా సమాఖ్యలలో వేళ్లూనుకుపోయిన కుటిల రాజకీయాలను, పక్షపాత ధోరణులను పూర్తిగా నివారించినప్పుడే గ్రామీణ ప్రాంతాల్లోని అసలైన ఆణిముత్యాలు వెలుగులోకి వస్తాయి.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను కలుసుకుని వ్యూహాత్మక చర్చలు జరపడమే కాకుండా.. భారత్-నెదర్లాండ్స్ దేశాల మధ్య ఉన్న క్రీడా బంధాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రికెట్, హాకీ వంటి క్రీడలు ఇరు దేశాలను బలంగా అనుసంధానిస్తున్నాయని.. భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో డచ్ క్రికెట్ జట్టు ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. ఇరు దేశాలు సాంకేతికత, సెమీకండక్టర్లు - రక్షణ రంగాలలో కలిసి పనిచేస్తున్న తరహాలోనే.. క్రీడా రంగంలోనూ డచ్ - యూరోపియన్ అథ్లెటిక్ శిక్షణా పద్ధతులను భారత్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేవలం క్రికెట్ పైనే కాకుండా అన్ని రకాల ఒలింపిక్ క్రీడలపై దేశీయంగా దృష్టి సారించాల్సి ఉంది.

చైనాకు ధీటుగా క్రీడారంగంలో భారత్ పెను మార్పులు సాధించాలంటే.. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ఒక తప్పనిసరి సబ్జెక్టుగా మార్చాలి. చైనా దేశం చిన్నతనం నుంచే పిల్లలలోని క్రీడా నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక ఒలింపిక్ అకాడమీలలో అత్యుత్తమ శిక్షణ, పోషకాహారం అందిస్తుంది. భారతదేశంలో కూడా కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో క్రీడాకారులకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, అంతర్జాతీయ స్థాయి కోచ్‌ల పర్యవేక్షణ..అత్యాధునిక స్పోర్ట్స్ సైన్స్ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలి. యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో వారి శారీరక సామర్థ్యాన్ని పతకాలుగా మార్చే అంతర్జాతీయ క్రీడా రోడ్‌మ్యాప్ ప్రభుత్వ పరంగా అత్యవసరం.

చివ‌రిగా.. భారతదేశపు వైవిధ్యభరితమైన సంస్కృతి.. అపరిమితమైన మానవ వనరులు నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ప్రధాని మోదీ అన్నట్లు నేటి భారతదేశం కేవలం పరివర్తనను మాత్రమే కాదు.. అత్యుత్తమమైన, అత్యంత వేగవంతమైన ప్రగతిని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్ వేయడానికి ముందే.. మైదానాల్లో మన క్రీడాకారులను గెలుపు గుర్రాలుగా మార్చే వ్యవస్థాగత సంస్కరణలు తేవాలి. రాజకీయ జోక్యం లేని స్పోర్ట్స్ బోర్డులు, అవినీతి రహిత ఎంపిక ప్రక్రియలు దేశంలో రూపుదిద్దుకున్నప్పుడే.. ప్రధాని కంటే ఒలింపిక్స్ కల సాకారమవ్వడమే కాకుండా.. గ్లోబల్ క్రీడా వేదికపై భారత్ ఒక సూపర్ పవర్‌గా అవతరిస్తుంది.

Tags:    

Similar News