మోడీ ప్రభుత్వం కూలుతుందా?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెబుతున్నారు.;

Update: 2026-04-13 04:00 GMT

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెబుతున్నారు. ఆమె బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మేరకు సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాదే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని కూడా స్పష్టంగా చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. గెలిస్తే మమత సీఎం అవుతారు. మరి ఆమె పార్టీ విజయం సాధిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమిటి ఈ లెక్కేమిటి అన్నది మమతా అక్కే చెప్పాలని అంటున్నారు.

కేజ్రీవాల్ అదే మాట :

ఇప్పటికి నెల రోజుల క్రితం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే రకమైన మాట చెప్పారు మోడీ ప్రభుత్వం ఈ ఏడాది అంతానికి ఉండదని చాలా స్ట్రాంగ్ గా చెప్పేశారు. ఎందుకు ఏమిటీ అన్న వివరాల జోలికి ఆయన పోలేదు కానీ మోడీ సర్కార్ ఉండదని ఆయన అంటున్నారు. అయితే దానిని బీజేపీ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు, కానీ అదే మాటను మమతా బెనర్జీ కూడా అనడంతో ఇపుడు బీజేపీ తీవ్రంగా ఆలోచిస్తుందా అన్న చర్చ సాగుతోంది.

ఇండియా కూటమికే :

ఇక ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మూడింట పోలింగ్ పూర్తి అయింది తమిళనాడు పశ్చిమ బెంగాల్ మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఈ అయిదులో బీజేపీకి అస్సాం పాండిచ్చేరి దక్కవచ్చు అని సర్వే అంచనాలు ఉన్నాయి. అలాగే కేరళ కాంగ్రెస్ కి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కి తమిళనాడు డీఎంకేకి దక్కవచ్చు అని కూడా అంచనాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఈ మూడు రాష్ట్రాలు పెద్దవి ఇండియా కూటమికి కీలకమైనవి. దాంతో అక్కడ గెలిస్తే ఆ ప్రభావం జాతీయ స్థాయిలో కచ్చితంగా ఉంటుందని లెక్క వేస్తున్నారు.

గాలి మళ్ళుతోందానా :

2024 లో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇండియా కూటమి వైఫల్యం చెందుతోంది. దాంతో ఈసారి మెజారిటీ స్టేట్స్ గెలుచుకోవడం బలమైన మమతా స్టాలిన్ వంటి వారు తిరిగి సీఎంలు కావడం అంటే అది ఇండియా కూటమి బలాన్ని తెలియచేస్తుందని అంటున్నారు. అంతే కాదు రాహుల్ గాంధీకి కేరళ విజయం ఒక బూస్ట్ అని చెబుతున్నారు. దాంతో ఫలితాలు అనుకూలంగా వస్తే రానున్న కాలంలో ఇండియా కూటమి గాలి దేశమంతా వీస్తుందని సంకేతం వెలువడినట్లే అని ఇండియా కూటమి భావిస్తోంది. అందుకే మోడీ సర్కార్ కి ముప్పు తప్పదని జోస్యం చెబుతున్నారా అని ఆలోచిస్తున్నారు.

మిత్రుల అండతోనే :

ఇక కేంద్రంలో బీజేపీ మిత్రుల అండతోనే ప్రభుత్వం నడుపుతోంది. మిత్రుల అవసరం బీజేపీకి పూర్తిగా ఉంది అయితే దేశంలో మారుతున్న పరిస్థితులు గాలి మార్పుని చూసి మిత్రులు ఎవరైనా తమ ఆలోచనలు మార్చుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం కుప్ప కూలుతుంది అన్నది ఇండియా కూటమి అంచనాలు అని అంటున్నారు. అయితే బీహార్ ఎన్నికల ముందు కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు అని బీజేపీ వర్గాల నుంచి వస్తున్న కౌంటర్. మొత్తం మీద చూస్తే మోడీ నాయకత్వంలో అయిదేళ్ళూ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని 2029 లో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News