జాతీయ బీజేపీ మాట : బాబూ, మోడీ ఒక్కటేనంట...
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ కూడా ఇద్దరు నేతల కాంబినేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ సేమ్ టు సేమ్ అంటూ జాతీయ బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి విశాఖలో ఈ రోజు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని కోట్ చేస్తూ పలువురు బీజేపీ జాతీయ నేతలు చంద్రబాబు-మోడీ జోడీపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో ప్రధాని మోడీ మూడో సారి అధికారంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ సంపూర్ణ మద్దతుతో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నిధులు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి జోడీపై బీజేపీ నేతల విశ్లేషణలు మరింత ఆసక్తిని పెంచాయి.
బాబు-మోడీ కాంబినేషన్ సూపర్ అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వంటివారు ట్వీట్ చేశారు. మోడీ-బాబు ఇద్దరు 70 ప్లస్ వయసులో యాక్టివ్ గా ఉండటాన్ని యూపీ సీఎం యోగి ప్రధానంగా ప్రస్తావించారు. ఏడు పదుల వయసులోనూ ఇద్దరూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అదేవిధంగా ఇద్దరు మరో 25 ఏళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయడం స్ఫూర్తిదాయకంటూ పేర్కొన్నారు.
ప్రధాని వికసిత్ భారత్ - 2047 లక్ష్యంగా పనిచేస్తుంటే, చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047కు రూపకల్పన చేయడాన్ని యూపీ సీఎం యోగి ప్రస్తావించారు. ఇది కూడా ఇద్దరికీ మధ్య కాంబినేషన్ కుదరడానికి మంచి కీలక పరిణామమని యోగి చెప్పారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ కూడా ఇద్దరు నేతల కాంబినేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఐటీ రంగం అంటే ఎంతో ఇష్టమని, రాష్ట్రాన్ని ఐటీ రంగంలో పరుగులు పెట్టించాలని కోరుకుంటారని, ప్రధాని మోదీ కూడా ఐటీపై ఆసక్తి చూపుతారన్న విషయాన్ని మహారాష్ట్ర సీఎం ప్రస్తావించారు. ప్రధాని దేశవ్యాప్తంగా ఐటీని ప్రోత్సహిస్తుంటే సీఎంగా చంద్రబాబు ఏకంగా ఐటీ రాజధానినే నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న సారూప్యతలకు నిదర్శనమని మహా సీఎం పడ్నవిస్ వ్యాఖ్యానించారు.
ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా సీఎం చంద్రబాబు దూర దృష్టిని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీతో పోల్చారు. ప్రధాని మోడీ దూర దృష్టికి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా దూర దృష్టితో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా చాలా మంది నాయకులు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు కాంబినేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శనివారం నిర్వహించిన యోగా డేలో కూడా ఇద్దరు నేతలు హుషారుగా పాల్గొని అంతర్జాతీయంగా యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు కృషి చేశారంటూ పలువురు అభినందిస్తున్నారు.