కేసీఆర్ అండ్ జగన్ : జాతీయ రాజకీయంలో కొత్త రూట్ ?

తెలుగు రాజకీయాల్లో కొత్త సమీకరణలకు ప్రధాని నరేంద్ర మోడీ తాజా పర్యటన దారి తీసింది.

Update: 2026-05-15 04:01 GMT

తెలుగు రాజకీయాల్లో కొత్త సమీకరణలకు ప్రధాని నరేంద్ర మోడీ తాజా పర్యటన దారి తీసింది. ఇక్కడ ఒక విషయం ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎన్డీయే బంధం మరింత పటిష్టం అయింది అని. పైగా టీడీపీ బీజేపీ జనసేన 2029 లో కూడా కలసికట్టుగా సాగుతాయని అర్ధం అవుతోంది. అంతే కాదు ఈ మోడీ బాబు పవన్ ల మధ్య మిత్ర బంధం మరింత బలీయం అయింది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బీఆర్ఎస్ తో బీజేపీ కలుస్తుందన్న ప్రచారం పూర్తిగా పక్కకు పోయింది. అలాగే ఏపీలో వైసీపీతో ఏదో నాటికి బీజేపీ స్నేహ హస్తం గట్టిగా అందిస్తుందన్న అశలూ అడుగంటాయని అంటున్నారు.

ఎన్డీయేకి దూరమే :

ఈ నేపథ్యంలో ఎన్డీయేకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వైసీపీకి అనివార్యంగా కనిపిస్తోంది. ఇంత జరిగిన తరువాత కూడా ఎన్డీయేకు మద్దతు పరోక్షంగా అయినా ఇస్తూ పోతే అది పార్టీ జనంలో బయట జనంలో తప్పుడు సంకేతాలు ఇచ్చే చాన్స్ ఉంటుంది. వాటికి మించి వైసీపీకి బలంగా ఒక్క మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ కూడా రివర్స్ అవుతుందన్న చర్చ కూడా ఉందని అంటున్నారు. ఇక ఏపీలో 2029 ఎన్నికల్లో బాబు పవన్ మోడీల త్రిమూర్తులను వైసీపీ అధినేత జగన్ మరోసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాంతో వైసీపీ ఇక మూడేళ్ళు ముందుగానే తన రాజకీయ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది అని అంటున్నారు.

కేసీఆర్ సైతం అదే :

తెలంగాణాలో కేసీఆర్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ అక్కడ స్థానికంగా అధికారంలో ఉంది. దాంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో నేరుగా చేతులు కలపలేని పరిస్థితి ఉంది. అలాగని బీజేపీతో కలసి ముందుకు సాగే సీన్ కూడా లేదు, బీజేపీతో బాహాటంగా కలిస్తే మైనారిటీ ఓట్లు ఇతర అణగారిన వర్గాల ఓట్లు పోతాయన్న భయం ఉంది. అయితే బీజేపీ పట్ల ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ తో అయితే బీఆర్ఎస్ ఉందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ వర్గాలు ఇంతకాలం చేస్తూ వచ్చాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఇపుడు మాత్రం మోడీ బాబు పవన్ తెలంగాణాలో కూడా ఎన్డీయే గా ముందుకు వస్తే మాత్రం బీఆర్ఎస్ కొత్త ఆలోచనలు చేయాల్సిందే అన్నది కూడా గులాబీ పార్టీలో ఉంది.

ఇండియా కూటమి వైపు :

ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వైపు కేసీఆర్ జగన్ చూపు పడుతోందా అన్న చర్చ కూడా ఉంది. ఎంత లేదనుకున్నా కాదనుకున్నా జాతీయ రాజకీయాన్ని కూడా గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అంతే కాదు తెలంగాణాలో ఏకంగా మోడీయే రంగంలోకి దిగితే ప్రాంతీయ పార్టీలతో అయినా చెలిమి చేయడం ద్వారా బలం పెంచుకోవాలన్నది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. దాంతోనే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ తో స్నేహం నెరిపే విషయంలో బీఆర్ఎస్ ఉత్సహాం చూపిస్తోంది అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా విజయ్ తో చెలిమి చేస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు కీలక పార్టీలు ఇపుడు జాతీయ రాజకీయాల్లో కొత్త రూట్ లోకి వెళ్తున్నాయా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే ఇండియా కూటమిలో కాంగ్రెస్ సారధ్యం కాకుండా ఏ మమతా బెనర్జీ లాంటి వారో పగ్గాలు అందుకుంటే తెలుగు నాట కూడా కొత్త పార్టీలు అందులో చేరేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఎన్డీయే తెలుగు రాష్ట్రాలలో బలంగా ఉండాలని మోడీ నిర్ణయించిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ రెండూ అలెర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజం ఉందో.

Tags:    

Similar News