త్రిష... తిరుచ్చి...రైమింగ్ ఓకే...టైమింగ్ ఎపుడు ?
తమిళనాడులో ఇపుడు కొత్త చర్చ రాజకీయంగా నడుస్తోంది. అక్కడ సినిమాలూ రాజకీయం ఎపుడూ కలిసి పోతూనే ఉంటాయి.
తమిళనాడులో ఇపుడు కొత్త చర్చ రాజకీయంగా నడుస్తోంది. అక్కడ సినిమాలూ రాజకీయం ఎపుడూ కలిసి పోతూనే ఉంటాయి. పైపెచ్చు తాజాగా తమిళనాడు సీఎం గా అయిన వ్యక్తి వెండి తెర నుంచి నేరుగా వచ్చిన వారు దళపతి విజయ్. ఆయన సినిమాల్లో రిటైర్ అయి రాలేదు, మంచి ఫాం లో ఉండగానే మధ్యలో వచ్చేశారు. దాంతో విజయ్ మీద ఆ సినీ గ్లామర్ అలా మెరుస్తూనే ఉంది. ఇపుడు ఆయనతో కలసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి రియల్ లైఫ్ లో ఆయనకు మంచి స్నేహితురాలిగా టీవీకే పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న ప్రముఖ దక్షిణాది నటి త్రిష రాజకీయ రంగ ప్రవేశం మీద అందరి చూపూ ఉంది. ఆమె పాలిటిక్స్ లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తున్నారు అన్నదే తాజా చర్చ అంతా.
త్రిష కోసమే అంటూ :
ఇక విజయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు నుంచి రెండు సీట్లలో పోటీ చేసారు. తిరుచ్చి అందులో ఒకటి. ఆయన రెండవ సీటుని అట్టేబెట్టుకుని తిరుచ్చికి రాజీనామా చేసారు. ఆ సీటుకు తొందరలో ఉప ఎన్నిక జరగబోతోంది. పైగా అది విజయ్ తొలిసారి గెలిచిన సీటు, టీవీకే వైపు నుంచి చూస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా అంతా భావిస్తున్నారు. విజయ్ ఖాళీ చేసిన సీట్లో పోటీ చేసే వారు అంతే మామూలు వారు కాకూడదని ఒక బీభత్సమైన నేం ఫేం ఉండేవారు అయి ఉండాలని కూడా అంతా కోరుకుంటున్నారు. దాంతో తిరుచ్చిలో త్రిష పోటీ చేస్తారు అని ఆమె కోసమే ఆ సీటు అని కూడా అపుడే ప్రచారం మొదలైపోయింది.
హాట్ టాపిక్ గా :
త్రిష గురించి ప్రస్తుతం తమిళ పాలిటిక్స్ లో హాట్ హాట్ గా డిబేట్ సాగుతోంది త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారు అని తిరుచ్చి నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. పైపెచ్చు త్రిష తిరుచ్చి ఈ రెండూ రైమింగ్ బాగుందని కూడా కలిపి చదివేస్తున్నారు. ఇక త్రిష పోటీ చేస్తారు అన్న ఊహాగానాలు మరింత బలంగా వినిపించడానికి కారణం ఈ సీటు నుంచి పోటీ అంటూ ఇంతకు ముందు ప్రచారంలో ఉన్న ప్రముఖ హీరో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తీసుకున్న కీలక నిర్ణయం అని అంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అని తిరుచ్చి నుంచి టీవీకే తరఫున పోటీ చేస్తారు అని ప్రచారం అయితే గట్టిగా ఒక దశలో నడిచింది. ఇపుడు చూస్తే ఆయన పోటీకి ఆసక్తిగా లేరని అంటున్నారు. దాంతో త్రిష పేరు మళ్ళీ ముందుకు వచ్చింది.
అధికార ప్రకటన రావాల్సిందే :
ఇక తిరుచ్చి సీటుకు ఉప ఎన్నికల గురించి ఎన్నిక సంఘం అధికారిక ప్రకటన చేసేంతవరకు ఈ రకమైన ప్రచారం సాగుతూనే ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే అధికార టీవీకే కానీ అలాగే త్రిష వైపు నుంచి కానీ ఈ ప్రచారం మీద రెస్పాన్స్ అయితే ఇప్పటి దాకా లేదు, ఊహాగానాలు అన్నవి రాజకీయాల్లో కామన్ కాబట్టి ఎవరూ అంత సీరియస్ గా తీసుకోవడం లేదని అంటున్నారు. అదే సమయంలో త్రిష పోటీ చేస్తారా అంటే దానికి కూడా అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే తమిళనాడులో శాసనమండలి అయితే లేదు, త్రిష రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి సీటు కంటే బంగారం లాంటి అవకాశం వేరొకటి లేదని అంటున్నారు. అదే సమయంలో త్రిష మరిన్ని సినిమాలకు సైన్ చేసింది అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు కాబట్టి త్రిష తిరుచ్చి అన్న ఊహాగానాలకు ఇంకా ఆస్కారం అలా ఉందని అంటున్నారు.