లోకేష్ కి దమ్ముంది...జగన్ పులివెందులకు మాత్రమే !
మంగళగిరిలో ఒకసారి ఓటమి పాలు అయినా పట్టు వీడకుండా లోకేష్ మళ్లీ అదే స్థానం నుంచి గెలిచారు అంటే అదే లోకేష్ సత్తా అని అన్నారు. కానీ విపక్ష నేత జగన్ మాత్రం పులివెందుల దాటి బయటకు వచ్చి ఎక్కడైనా పోటీ చేసే సత్తా ఉందా అని విజయ్ ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన చింతకాయల విజయ్ తాజాగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నర్శీపట్నంలో తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ని దమ్మున్న నాయకుడిగా కొనియాడారు. లోకేష్ తనది కాని నియోజకవర్గంలో టీడీపీకి అంతగా విజయావకాశాలు లేని సీట్లో గెలిచి చూపించారు అని విజయ్ గుర్తు చేశారు. మంగళగిరిలో ఒకసారి ఓటమి పాలు అయినా పట్టు వీడకుండా లోకేష్ మళ్లీ అదే స్థానం నుంచి గెలిచారు అంటే అదే లోకేష్ సత్తా అని అన్నారు. కానీ విపక్ష నేత జగన్ మాత్రం పులివెందుల దాటి బయటకు వచ్చి ఎక్కడైనా పోటీ చేసే సత్తా ఉందా అని విజయ్ ప్రశ్నించారు. జగన్ పులివెందులకు మాత్రమే పరిమితం అని విజయ్ ఎద్దేవా చేసారు.
లోకేష్ తోనే టీడీపీ :
తెలుగుదేశం పార్టీకి సమర్ధుడు అయిన నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. ఆయన చేతుల్లోనే టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని విజయ్ అన్నారు. లోకేష్ నాయకత్వాన్ని ప్రతీ కార్యకర్త పూర్తి స్థాయిలో బలపరుస్తున్నారని కూడా విజయ్ చెప్పారు. లోకేష్ తన కుటుంబంగానే పార్టీలోని అందరినీ చూసుకుంటారు అని ఆయన తమ కుటుంబం మీద చూపించే అభిమానం ఆప్యాయతలు ఎంతో గొప్పవని అని విజయ్ చెప్పారు. ఇందుకు గానూ తాను లోకేష్ కి రుణపడి ఉంటాను అని విజయ్ చెప్పారు.
బాబును నమ్ముకుంటేనే చాలు :
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి విజయ్ చెబుతూ ఆయనను నమ్ముకుంటే చాలు అందరికీ న్యాయం తప్పకుండా జరుగుతుందని అన్నారు. తాను మూడు సార్లు అనకాపల్లి ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేశాను అని విజయ్ చెప్పారు. అయితే ఆ మూడు సార్లు నిరాశ ఎదురైంది అని అన్నారు. అయితే అదే సమయంలో చంద్రబాబు తనను పిలిచి నన్ను నమ్ము విజయ్ నీకు మంచి స్థానం ఇస్తాను అని చెప్పేవారు అని విజయ్ గుర్తు చేసుకున్నారు. ఇపుడు బాబు ఏకంగా తనకు రాజ్యసభ సీటు ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నారు అని బాబుకు సదా కృతజ్ఞతలు అని విజయ్ చెప్పారు. తమ కుటుంబానికి మొదటి నుంచి చంద్రబాబు ఆదరణ మద్దతు ఉందని విజయ్ చెప్పారు.
జెండా కూలిగా పనిచేస్తా :
తాను తెలుగుదేశం పార్టీకి జెండా కూలీగా పనిచేస్తాను అని విజయ్ చెప్పారు. పార్టీ ఆదేశాలు తుచ తప్పకుండా పాటిస్తాను అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా తాను ముందు ఉంటాను అని విజయ్ హామీ ఇచ్చారు. తాను పార్టీ కోసం ఎంతైనా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నర్సీపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీగా తన వంతుగా కష్టపడి పనిచేస్తాను అని విజయ్ చెప్పారు.
నర్శీపట్నానికి మోడీ :
నర్శీపట్నంలో సృష్టి క్షేత్రం పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని విజయ్ తెలిపారు. సృష్టి క్షేత్రంలో ప్రపంచంలోనే ఎత్తైన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలను నెలకొల్పుతామని విజయ్ చెప్పారు. నర్శీపట్నంలో అభివృద్ధి పనులకు ఎవరు ఆటంకం కలిగించినా సహించేది లేదని విజయ్ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే అయ్యన్నపాత్రుడు వారసుడిగా విజయ్ సింహ గర్జన చేశారు. రానున్న రోజుల్లో అయ్యన్న ప్లేస్ లో పూర్తి స్థాయి రాజకీయానికి విజయ్ సిద్ధపడుతున్నారు అనడానికి తాజా సభ ఒక నిదర్శనంగా చెబుతున్నారు.