ఒకే వ్యక్తికి 36 గంటలు.. 5 సర్జరీలు.. శభాష్ ఉస్మానియా హాస్పిటల్
ఒకే వ్యక్తికి 36 గంటల పాటు నాన్ స్టాప్ గా ఐదు అవయువాల్ని మార్చిన వైనం హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
సర్కారు దవాఖానా మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఒక మోస్తరు అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే కన్నా.. ప్రైవేటుకు పరుగులు తీసే ధోరణే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే.. ప్రైవేటుకు.. కార్పొరేట్ కు ధీటుగా అప్పుడప్పుడు సర్కారీ దవాఖానాలు మెరుపులు మెరిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఒకే వ్యక్తికి 36 గంటల పాటు నాన్ స్టాప్ గా ఐదు అవయువాల్ని మార్చిన వైనం హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
36 గంటల పాటు అవిశ్రాంతంగా ఐదు సర్జరీలు చేసిన ఉస్మానియా వైద్యుల మీద అభినందల వర్షం కురుస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం వేళ.. ఉస్మానియా వైద్యులు ఈ ఘనతను సాధించటం విశేషం. మరో కీలక అంశం ఏమంటే.. తాజాగా చేసిన ఐదు అవయువాల మార్పిడి సర్జరీలు అల్లాటప్పా ఏమీ కావు. విపరీతమైన ఒత్తిడిని భరిస్తూ.. విజయవంతంగా సర్జరీలు పూర్తి చేయటం విశేషం. ఇదెంత అరుదైన రికార్డు అంటే.. దేశంలోనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వ ఆసుపత్రి ఇలాంటివి చేసింది లేదు. దీంతో ఉస్మానియా డాక్టర్స్ టీంకు దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్ శ్రీశైలం గౌడ్ ఫ్యామిలియల్ అడెనో మాటస్ పొలిపోసిస్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పాటు.. పెద్దపేగు క్యాన్సర్ ను బాధపడుతున్నాడు. గతంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పెద్దపేగును పూర్తిగా.. చిన్నపేగులో అరవై శాతాన్ని తొలగించారు. అనంతరం తీవ్ర పోషహాకార లోపంతో బరువు తగ్గటంతో పాటు.. కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. ఆర్నెల్ల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలోని వైద్యుల్ని సంప్రదించాడు.
అతడ్ని పరీక్షించిన వైద్యులు.. ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తిని అతడి జీర్ణ వ్యవస్థ పూర్తిగా కోల్పోయిన విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అవయువ మార్పిడే మార్గమని తేల్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళా రోగి కుటుంబ సభ్యులు అవయువ దానానికి ముందుకు రావటంతో.. ఈ అరుదైన శస్త్రచికిత్సకు ఉస్మానియా వైద్యులు నడుం బిగించారు.
దాత శరీరం నుంచి జీర్ణవ్యవస్థకు చెందిన ఐదు అవయువాలు (జీర్ణాశయం, డ్యుయోడినం, ప్యాంక్రియాస్, చిన్న పేగు.. కుడివైపు పెద్దపేగు) ఒకే క్లస్టర్ గా సేకరించి.. జూన్ 29 నుంచి 30 సాయంత్రం వరకు ఏకధాటిగా 36 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవంతంగా ఆ ఐదు అవయువాలను శ్రీశైలం గౌడ్ కు అమర్చారు. ఈ చికిత్స కోసం అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాల్ని స్వీకరించారు. ఈ మారథాన్ సర్జరీ కోసం ఉస్మానియా ఆసుపత్రిలోని పలు విభాగాల సిబ్బంది షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు శ్రమించారు. రోగిని 36 గంటల పాటు అనస్థీసియా స్థితిలో ఉంచి బీపీ.. పల్స్ పడిపోకుండా కాపాడటం మామూలు విషయం కాదని వైద్యులు చెబుతున్నారు.
ఈ తరహా సర్జరీకి కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే రూ.కోటి వరకు ఖర్చు అవుతుంది. కానీ.. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించారు. నిజానికి అత్యధిక రిస్క్ ఉన్న ఈ వరుస సర్జరీలు చేసేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ముందుకు రావన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ ఉదంతంతో ఉస్మానియా వైద్యులు తమ సత్తాను చాటారని చెప్పాలి. ప్రోత్సహించాలే కానీ వారు అద్భుతాలు సాధిస్తారన్న విషయం తాజాగా రుజువైందని చెప్పాలి. అరుదైన శస్త్రచికిత్సతో చరిత్రను క్రియేట్ చేసిన ఉస్మానియా వైద్యులకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ఘనత సాధించిన వైద్యుల టీంను సీఎం రేవంత్ ప్రత్యేకంగా పిలిపించుకొని వారిని అభినందిస్తే.. మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పక తప్పదు.