బీఆర్ఎస్ కాదు ఎఫ్ఆర్ఎస్.. పొంగులేటి పంచ్ మామూలుగా లేదుగా
అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు చేయటం మామూలే. అధికారంలోకి వచ్చిన కొంతకాలం వరకు విమర్శల పదును ఒక మోస్తరుగా ఉంటుంది.
అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు చేయటం మామూలే. అధికారంలోకి వచ్చిన కొంతకాలం వరకు విమర్శల పదును ఒక మోస్తరుగా ఉంటుంది. పాలన మొదలెట్టిన రెండేళ్ల తర్వాత నుంచి విపక్షాల విమర్శల వర్షం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు పాలనా పరమైన తప్పులు.. వైఫల్యాలు ప్రతి ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే.. వీటిని ఎంత తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు అలాంటి పనే చేస్తోంది రేవంత్ సర్కారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిన నేపథ్యంలో.. నిత్యం ఏదో అంశం మీద విపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ రావులు విమర్శలు సంధిస్తున్న వేళ.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.
ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ముందుంటే.. ఆ తర్వాతి స్థానాల్లో పొంగులేటి.. శ్రీధర్ బాబు.. భట్టి.. ఉత్తమ్ తదితరులు ఉంటున్నారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ ముఖ్యనేతలపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మంత్రిపొంగులేటి ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం నెత్తిన రూ.8 లక్షల కోట్లకు పైనే అప్పుల భారాన్ని మోపిందన్న ఆయన.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం వేల కోట్ల ఆస్తులు పెరిగినట్లుగా ఆరోపించారు.
అంతేకాదు బీఆర్ఎస్(భారత రాష్ట్రసమితి) పేరును సరికొత్తగా ఎఫ్ఆర్ఎస్ గా పేర్కొనటం విశేషం. ఇంతకూ ఎఫ్ఆర్ఎస్ మరేమిటోకాదు.. ఫాంహౌస్ రాష్ట్ర సమితిగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ప్రజాసమస్యలపై పోరాడకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారంటూ మండిపడుతూ.. బీఆర్ఎస్ పేరును ఎఫ్ఆర్ఎస్ గా మార్చుకునే సమయం ఆసన్నమైందంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. చెల్లి.. బావ ఫోన్లను ట్యాప్ చేసిన వ్యక్తులు సభ్యత.. సంస్క్రతి గురించి మాట్లాడటమా? అంటూ ఏద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఫామ్ హౌస్ పార్టీకి.. గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్లుకట్టించిన పార్టీకి మధ్య పోటీ జరగనుందన్నారు. మరోసారి కారు బోల్తా పడటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే కేసీఆర్ ను ఫామ్ హౌస్ పశుపతిగా ముఖ్యమంత్రి రేవంత్ అభివర్ణించిన వేళ.. పొంగులేటి సైతం రేవంత్ ఫాంహౌస్ మాటల్ని అందిపుచ్చుకొని బీఆర్ఎస్ కు కొత్త పేరు పెట్టిన పేరు ఆసక్తికరంగా మారింది. ఈ ఫామ్ హౌస్ పంచ్ లకు గులాబీ అధినేత ఏరీతిలో రియాక్టు అవుతారో చూడాలి.