బిగ్ క్వశ్చన్: తీసుకొనుడే కానీ ఇచ్చుడు ఉండదా?

సమాజంలోని ఎన్ని వర్గాలు ఉన్నప్పటికి..రాజకీయ నేతలు.. సంపన్నులు.. మేధావుల అభిప్రాయాలకు తగ్గట్లే.. పాలన నడుస్తుంటుంది.

Update: 2026-07-02 07:08 GMT

సమాజంలోని ఎన్ని వర్గాలు ఉన్నప్పటికి..రాజకీయ నేతలు.. సంపన్నులు.. మేధావుల అభిప్రాయాలకు తగ్గట్లే.. పాలన నడుస్తుంటుంది. ప్రజలను సైతం వారు ప్రభావితం చేస్తుంటారు. నిజానికి ఈ వర్గానికి చెందిన వారు మొత్తం జనాభాలో 5 శాతం కంటే తక్కువే ఉంటారు. వారంతా కలిసి తమ మాటలతో.. చేష్టలతో.. నిర్ణయాలతో 95 శాతం ప్రజల్ని ప్రభావితం చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ మూడు వర్గాల్లోని వారు తప్పుడు విధానాల జోలికి వెళతారో.. లేనిపోని తలనొప్పులు తెర మీదకు వస్తుంటాయి.

ఏపీతో పోలిస్తే తెలంగాణలోని మేధావి వర్గం చైతన్యవంతమైనది. అంతేకాదు.. తమ గడ్డ మీద బోలెడంత అభిమానం వారి సొంతం. వ్యక్తిగత లబ్థి ఆశించకుండా.. సమాజ ప్రయోజనాల కోసం తపిస్తుంటారు. అయితే.. ఇటీవల కాలంలో ఈ మేధావుల పేరుతో కొందరు సూడో మేధావులు తయారయ్యారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. తమ లోపలి కడుపు మంటను.. విద్వేషాన్ని పోస్టుల రూపంలో.. వీడియోల రూపంలో పంచుకుంటూ ఉంటారు. అయితే.. ఇలాంటి వారిని నియంత్రించాల్సిన అసలుసిసలు మేధావులు మౌనంగా ఉండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ సూడో మేధావులు చాలా ప్రమాదకారులు. వీరికి ఉన్న అతితెలివి దెబ్బకు.. వీళ్లతో మనకెందుకులే అన్నట్లుగా అసలైన మేధావులు సైతం మౌనంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే.. సూడో మేధావుల విద్వేషపు వాదనలకు సమాధానాలు చెబితే.. వారిని సైతం వదలకుండా నిందలు వేసేందుకు వెనుకాడని తెంపరితనం వారి సొంతం. చిన్న అవకాశం వచ్చినా.. తమ మెదడులో ఉన్న విద్వేషాన్ని వెళ్లకక్కేందుకు ఏ మాత్రం మొహమాటపడని తీరు వారి సొంతం.

యాదాద్రి ఆలయ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు చోటు కల్పించటాన్ని కొందరు ప్రాంతీయ కోణంలో మాట్లాడితే.. మరికొందరు సినిమా వాళ్లకు ఇలాంటి అధ్యాత్మిక వ్యవహారాల్లో చోటు కల్పిస్తారా? లాంటి పిచ్చి వాదనలను తెర మీదకు తెస్తున్నారు. అసలు మెగాస్టార్ కుటుంబం హైదరాబాద్ కు (తెలంగాణ)వచ్చింది ఎప్పుడు దాదాపు నలభై ఏళ్లు దాటిపోతోంది కదా? మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చేయటమే కాదు.. ఇక్కడే స్థిరపడిపోయారు. వారి పిల్లలు ఇక్కడే పెరిగి పెద్దవాళ్లు అయ్యారు.

అలాంటప్పుడు అప్పుడెప్పుడో పుట్టి కొన్నేళ్లు మాత్రమే పెరిగిన ప్రాంతం ముద్రను.. తెలంగాణలో స్థిరపడిన నలభై ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రా ముద్ర వేయటం ఎంతవరకు సబబు? అన్నది ఒక ప్రశ్న. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ లో పెట్టారే కానీ ఏపీలోని మరెక్కడా పెట్టలేదు కదా? తాను సంపాదించిన దానిలో నూటికి 95 శాతానికి పైనే తెలంగాణలోనే ఉంచుకున్నారు తప్పించి.. ఆ సంపదను ఏపీకి తరలించింది లేదు కదా? అలాంటప్పుడు చిరంజీవికి ఆంధ్రా ట్యాగ్ ఎలా తగిలిస్తారు? అన్నది ప్రశ్న.

ఇప్పుడు నోళ్లు తెరుస్తున్న వారంతా..కేసీఆర్ ప్రభుత్వంలో సమంతకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదాను కట్టబెట్టినప్పుడు ఏం మాట్లాడలేదేం? అలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేవని నోళ్లు.. ఇప్పుడు ఎందుకు నోరు పారేసుకుంటున్నాయి? యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డులో ఆంధ్రా అంటూ రాగాలు తీస్తున్న వారు.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చోటు కల్పించిన దానితో సరిపోక.. తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే సాధారణ భక్తులకు సైతం సౌకర్యాల గురించి డిమాండ్ చేయటం.. స్వామి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులకు కోటా గురించి డిమాండ్ చేయటం తెలిసిందే. ఇంతలా తమకు నచ్చిన అంశాల విషయంలో డిమాండ్ చేసి మరీ సాధించుకున్నప్పుడు గుర్తుకు రాని ప్రాంతీయత.. యాదాద్రి బోర్డులో సురేఖ చిరంజీవికి కేటాయించినప్పుడు రావటం దేనికి నిదర్శనం? ఇదంతా చూస్తే.. తీసుకొనేడే కానీ.. ఇచ్చేందుకు ముందుకు రాని సూడో మేధావితనం విడిపోయి కలిసి ఉందామనే తెలంగాణ ఉద్యమ ప్రాధమిక నినాదానికి పూర్తి వ్యతిరేకం కదా? ఇలాంటితీరును మొగ్గలోనే తుంచేయాల్సిన బాధ్యత అసలుసిసలు తెలంగాణ మేధావుల మీద ఉంది కదా? వారంతా సూడో మేధావుల నోళ్లు మూయించే పని ఎందుకు చేయట్లేదు? అన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News